బెయిల్ రద్దు కాలేదు… జైల్ కి వెళ్లాల్సిన ప్రమాదం లేదు!

 

బాహుబలి సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు! అయితే, ఏపీలో ఇవాళ్ల పండగ చేసుకుంటోన్న మరో వర్గం… జగన్ ఫ్యాన్స్! కొన్నాళ్లుగా అటు జగన్ కి, ఇటు ఆయన శ్రేయోభిలాషులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బెయిల్ రద్దు పిటీషన్ ఎట్టకేలకు రిలీఫ్ ఇచ్చింది! యువనేత ఇప్పుడప్పుడే జైలుకెళ్లే ప్రమాదం లేకుండా పోయింది! వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు!

 

జగన్ అక్రమాస్తుల కేసు ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. ఆయన నెలల తరబడి చంచల్ గుడాలో మగ్గాల్సి వచ్చింది. ఎలాగో బెయిల్ పై బయటకొచ్చిన ఆయన 2014లో సీఎం అయ్యి తీరుతానని భావించారు. కాని, ఆ కలని కల్ల చేస్తూ ఓటర్లు టీడీపీకి ఛాన్స్ ఇచ్చారు. సర్లే అని ప్రతిపక్షంలో కూర్చున్న జగన్ కి వలస పక్షుల పుణ్యమాని ఇప్పటి వరకూ కంటి మీద కునుకు వుండటం లేదు. ఇన్ని కష్టాల మధ్యలో ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టుకెళ్లింది. మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి సాక్షి మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ కారణంగా చూపుతూ దర్యాప్తు సంస్థ పావులు కదిపింది. అయితే, జగన్ పైకి చూపించకపోయినా కాస్త టెన్షన్ పడ్డారనే చెప్పాలి! బెయిల్ కాని రద్దైతే ఆయన రాజకీయ భవిష్యత్తే పెద్ద కొశన్ మార్క్ అయ్యేది!

 

జగన్ మీద వున్న కేసు చాలా బలమైంది. నిర్దోషిగా ఆయన బయటపడతారని ఎవరూ చెప్పలేని పరిస్థితి. అటువంటిది ఇప్పుడు అమల్లో వున్న బెయిల్ కూడా రద్దు అయి వుంటే పెద్ద గండంగానే మారేది. ఎందుకంటే, మోదీ అన్ని రాష్ట్రాల ఎన్నికలతో సహా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే యేడు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. అలాగే, టీడీపీ కూడా ముందస్తు ఎన్నికలకు సర్వ సన్నద్ధంగా వుంది. అంటే… రాబోయే నెలల్లో ఎప్పుడైనా ఎన్నికల నగారా మోగొచ్చు. అలాగని ఈ పరిణామం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్పలేం. యథావిధిగా 2019లోనే ఎన్నికలు జరిగితే… అందుకు కొంత టైం వున్నట్టే!

 

అసలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… జగన్ మళ్లీ జైలుకి వెళ్లటం మాత్రం నెగటివ్ గానే పని చేస్తుంది. ఇప్పటికే చాలా మంది నేతల వలసలతో వైసీపీ డల్ గా వుంది. ఇక అధినేత కూడా జైల్లోకి వెళ్లిపోతే నాయకులు, కార్యకర్తల నైతిక స్థైర్యం దిగిజారిపోవచ్చు. ఈ పరిణామం టీడీపీ, బీజేపీలకి లబ్ధి చేకూరుస్తుంది! కాని, కోర్టు బెయిల్ రద్దు చేయటం కుదరదని చెప్పటంతో జగన్ కు ఇవాళ్ల పెద్ద రిలీఫే వచ్చింది. అలాగే, ఆయన విదేశీ టూర్ కూడా చేసుకోవచ్చని న్యాయస్థానం చెప్పటం జగన్ కి మరింత ఊరట!

 

బెయిల్ రద్దు చేయకుండా కోర్టు ఇచ్చిన సువర్ణావకాశాన్ని జగన్ చక్కగా వాడుకోవాలి. పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని యుద్ధానికి సిద్దం చేసుకోవాలి. ముందస్తు ఎన్నికలు వచ్చినా, సరైన టైముకే వచ్చినా అన్ని విధాల రెడీగా వుండాలి. కారణం, అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో ఎప్పుడు ఏ తీర్పు వస్తుందో ఎవ్వరూ చెప్పలేని స్థితి. జగన్ తాను బయట వున్నా, లోపల వున్నా వైసీపీ… టీడీపీని ధీటుగా ఎదుర్కొనేలా తయారు చేయాలి. లేదంటే అపర చాణుక్యుడు చంద్రబాబు గూటిలోకి మరికొందరు వైసీపీ నేతలు జంప్ చేయవచ్చు. బీజేపీ కూడా ఢిల్లీ నుంచి పావులు కదుపుతూ ప్రముఖ వైసీపీ నాయకులకి గాలం వేయవచ్చు! ఈ రెండు పరిణామాలు జరిగితే… ఒకవేళ జగన్ జైలుకి వెళితే… తిరిగి వచ్చేప్పటికీ ఏమీ మిగలదు!