ఐవైఆర్ కృష్ణరావు…. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారా?

ఏపీలో సోషల్ మీడియా తుఫాన్ లు పదే పదే చెలరేగుతున్నాయి. ఆ మధ్య వైసీపీకి సపోర్ట్ గా, టీడీపీకి వ్యతిరేకంగా కొందరు పోలిటికల్ పంచ్ లు అంటూ కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుకి వెళ్లారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ప్రభుత్వంలోని సీనియర్ అధికారే సోషల్ మీడియాలో కలకలం రేపారు. అదీ తనకు పిలిచి పదవిచ్చి గౌరవించిన సీఎంని, సర్కార్ నే విమర్శిస్తూ! ఇంతకీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణ రావు చేసిన నిర్వాకం ఏంటి?

 

ప్రభుత్వం అంటే ఒకరో, ఇద్దరో మనుషులు కాదు. సీఎం నుంచీ గవర్నమెంట్ క్లర్కుల దాకా అందరూ సమిష్టిగా చేసే పాలనే… గవర్నమెంట్! ఇందులో అత్యంత కీలకమైన వారు ఐఏఎస్ లు. వారు పాలక పక్షాలు మారినా ఎక్కడికి పోరు. సర్వీస్ ముగిసేదాకా దశాబ్దాల పాటూ దేశం, రాష్ట్రంపై ప్రభావం చూపుతారు. అలాంటి బాధ్యతగల ఐఏఎస్ గా మంచి పేరే తెచ్చుకున్నారు ఐవైఆర్. అందుకే, ఆయన్ని ఏరికోరి తన ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు చంద్రబాబు. అయితే, ఇప్పుడు ఈ మాజీ ప్రధాన కార్యదర్శి రివర్స్ లో వస్తున్నారు. తనకు ప్రధాన కార్యదర్శి పదవే కాక క్యాబినేట్ హోదాగల బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చిన ముఖ్యమంత్రిపై సోషల్ మీడియా దాడి మొదలుపెట్టారు!

 

ఐవైఆర్ కృష్ణరావు గత కొన్ని రోజులుగా ఏపీ సీఎంకి, మంత్రి లోకేష్ కి, మొత్తంగా టీడీపీ ప్రభుత్వానికే వ్యతిరేకంగా పోస్టులు చేస్తూ వస్తున్నారు ఫేస్బుక్ లో. ప్రభుత్వానికి కుల పిచ్చిని అంటగట్టే పోస్టుల్ని కూడా షేర్ చేశారట. ఇక టీటీడీ ఈవోగా తెలుగువాడు కాని అధికారిని చంద్రబాబు నియమించడం కూడా కృష్ణరావుకు నచ్చలేదు. సోషల్ మీడియాలో అదే విషయం స్పష్టంగా చెప్పారు. కాని, ఇలా ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకుంటే ఫేస్బుక్ లో విమర్శించాల్సింది సామాన్య ప్రజలు, ప్రతిపక్షాలు. కాని, అధికారంలోని గవర్నమెంట్ ఇచ్చిన క్యాబినేట్ హోదా గల పదవిలో వున్న కృష్ణరావు అందరి ముందూ నోరుపారేసుకోవటం ఎందుకు? నేరుగా చంద్రబాబుతో తన అభ్యంతరాలు చెప్పవచ్చు కదా? అది వీలుకాకపోతే సర్కార్ ఇచ్చిన పదవి వదిలేసి వచ్చి స్వేచ్ఛగా విమర్శలు చేయాలి. అంతే కాని, ఏ గవర్నమెంటైతే సరిగ్గా పని చేయటం లేదని ఆరోపిస్తున్నామో… అదే ప్రభుత్వం నుంచి నెలనెలా లబ్ధి పొందుతూ .. తిరిగి జనం ముందు బురదజల్లడం, ఎలాంటి నైతికత అనిపించుకుంటుంది?

 

ఇప్పటికే… గత కొన్ని నెలలుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అగ్ర నాయకులు కొందరు తమ ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. స్వంత పార్టీ, నాయకత్వం పరువు తాకట్టు పెడుతున్నారు. ఇక ఇప్పుడు కృష్ణరావు లాంటి అధికారులు కూడా తోడైతే… చంద్రబాబుకు తీవ్ర నష్టం తప్పకపోవచ్చు. కాబట్టే సీఎం అమాంతం ఐవైఆర్ ను నామినేటెడ్ పదవి నుంచి తొలగించారు కూడా! ఈ మొత్తం వ్యవహారంతో కృష్ణరావు ఒకవేళ జగన్ కు ఏమైనా దగ్గరవ్వాలని ఆశించి వుంటే… ఆయన రాజకీయ ఆశలు, లెక్కలు ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం. కాని, ఆయన మాత్రం చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడి నమ్మకాన్ని వమ్ము చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారన్నది మాత్రం వాస్తవం…