ఐవైఆర్‌‌పై వేటు..?

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటు పడనుందా అంటే అవుననే అంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. కృష్ణారావు తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి షేర్ చేసిన కొన్ని పోస్ట్‌లు, ఆయన రాసిన కొన్ని పోస్ట్‌లు టీడీపీ వర్గాల్లో కలకలం రేపాయి. దీంతో ఐవైఆర్‌పై అన్ని వైపుల నుంచి ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం సీఎం బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్‌ పదవి నుంచి ఐవైఆర్‌ను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ కల్పించడంపైనా..బాహుబలి-2కి టిక్కెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడాన్ని తప్పుబడుతూ కృష్ణారావు తన ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్ట్‌లు చేశారు..అంతేకాకుండా ఇదే అంశంపై వేరే వారు రాసిన పోస్టు‌లను షేర్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఉన్నత స్థానాన్ని కట్టబెట్టి గౌరవిస్తే..పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారని కృష్ణారావుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఆయనపై వేటు వేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.