తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు... మేఘాలో ఐటీకి దొరికిన ఆధారాలు...!

 

మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో అనేక రహస్యాలు బట్టబయలవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యనేత కోసం ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో మేఘా జరిపిన ఆర్ధిక లావాదేవీల గుట్టురట్టవగా, ఇప్పుడు మరో సంచలన రహస్యం బయటికొచ్చింది. ప్రైవేటీకరణ కాకుండా ఆర్టీసీని కాపాడుకోవడానికే సమ్మె దిగామంటోన్న కార్మికుల మాటలను నిజం చేస్తూ ఆధారాలు దొరికాయి. మేఘా కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రణాళికల వివరాలు దొరికినట్లు ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఐటీ దాడుల్లో దొరికిన ఆధారాల మేరకు, ఇప్పటికే టీఎస్ ఆర్టీసీలో కొంత భాగం మేఘా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఇంగ్లీష్ డైలీ విశ్లేషించింది.

మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో గోల్డ్ స్టోన్ అండ్ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్ తయారీ కంపెనీకి సంబంధించిన పత్రాలు దొరికాయి. ప్రస్తుతం ఓలెక్ట్రాలో యాభై శాతం వాటా మేఘా కృష్ణారెడ్డికి, 38 శాతం గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు... మిగతాది పబ్లిక్ చేతుల్లో ఉంది. మేఘా కృష్ణారెడ్డి, గోల్డ్ స్టోన్ ప్రసాద్... కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు. ఇక, ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు... మియాపూర్ భూకుంభకోణంలో మారుమోగిపోయింది. ఇలాంటి బ్యాక్ గ్రౌండున్న ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ... 40 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తెలంగాణ ఆర్టీసీకి సరఫరా చేసింది. అయితే, ఈ ఒక్కో బస్సు ఖరీదు రెండు కోట్లు కాగా, ఇందులో ఒక కోటి రూపాయలను టీఎస్-ఆర్టీసీకి కేంద్రం సబ్సిడీ రూపంలో ఇచ్చింది. అయితే, ఈ సబ్సిడీ అమౌంట్ మొత్తం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి చేరాయి. బస్సులను అద్దెకిచ్చి కిరాయి వసూలు చేస్తోన్న... ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీ మనీ చేరినట్లు ఐటీకి ఆధారాలు లభించాయి.

అయితే, త్వరలో 334 ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టును మేఘా కృష్ణారెడ్డి దక్కించుకోబోతున్నారు. అంటే ఈ 334 బస్సుల సబ్సిడీ అంటే 334 కోట్ల రూపాయలు కూడా ఒలెక్ట్రా  కంపెనీ ఖాతాలో పడనున్నాయి. వీటికి సంబంధించిన డాక్యుమెంటన్నీ ఐటీ అధికారుల చేతికి చిక్కాయి. దాంతో ఈ ఐటీ రైడ్స్ వ్యవహారం చివరికి ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోందని ఆ ఇంగ్లీష్ డైలీ కథనం ఇవ్వడం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.