వైసీపీ, టీడీపీ, జనసేనకి కొత్త టెన్షన్... 4నెలల తర్వాత షాకిస్తోన్న ఈసీ అండ్ ఐటీ.!

 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం ముగిసి నాలుగు నెలలు దాటిపోతున్నాయి. అధికారపక్షం అపోజిషన్ కు, ప్రతిపక్షం రూలింగ్ లోకి రావడంతో, ఎవరి పనుల్లో వాళ్లు బిజీ-అయిపోయారు. అయితే, అటు గెలిచినోళ్లకి ఇటు ఓడినోళ్లకి ఎన్నికల కమిషన్ షాకిస్తోందట. ఎప్పుడో అయిన ఎన్నికలకు ఇప్పుడు లెక్కలు అడుగుతోందట. అదీ కూడా ఐటీశాఖ ద్వారా. అటు గెలిచినోళ్లకి ఇటు ఓడినోళ్లకి నోటీసులిస్తోన్న ఐటీశాఖ... ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తులకు లెక్కలు చెప్పాలంటూ షాకిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులనే కాదు, ఎన్నికల్లో పోటీచేసిన ప్రతి ఒక్కరినీ తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదాయపు పన్నుశాఖ నోటీసులు పంపుతోంది. దాంతో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షంతోపాటు పోటీచేసిన అభ్యర్ధులందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట.

ముందుగా ఉత్తరాంధ్రలో ఈ ప్రక్రియ మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే అటు గెలిచినోళ్లకి ఇటు ఓడినోళ్లకి అందరికీ ఐటీశాఖ నోటీసులు పంపింది. ఎన్నికల కమిషన్ కొత్త రూల్ ప్రకారం అభ్యర్ధుల అఫిడవిట్లలో పొందుపర్చిన ఆస్తుల వివరాలు పరిశీలించాల్సిందిగా ఆదాయపు పన్నుశాఖకు సూచించింది. ఆ మేరకు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు... ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులందరికీ నోటీసులు పంపి, ఆస్తులపై లెక్కలు అడుగుతున్నారు. 2013 నుంచి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్ బుక్స్, ఇతర ఆస్తుల పత్రాలు తీసుకురావాలని సూచిస్తున్నారు. స్థిర చరాస్తుల్లో క్రయ విక్రయాలు జరిగితే ఆ డాక్యుమెంట్లు కూడా తమ ముందుంచాలని ఆదేశిస్తున్నారట. నోటీసుల్లో చెప్పినవిధంగా అభ్యర్ధులు తమ ముందు హాజరుకాకపోతే, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సమన్లు కూడా జతచేసి పంపిస్తున్నారు అధికారులు. 

ఐటీశాఖ ఇలా సడన్ గా నోటీసులు జారీ చేయడంతో అటు గెలిచినోళ్లు ఇటు ఓడినోళ్లు అందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఏదో ఎన్నికల సమయంలో హడావిడిగా అఫిడవిట్లు దాఖలు చేసేశామని, ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి వాటి గురించి వివరాలు అడిగితే ఏం చెప్పాలంటూ భయాందోళనలకు గురవుతున్నారు. అఫిడవిట్ లో పొందుపర్చిన ప్రతి డాక్యుమెంట్ తమకు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొనడంతో నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఒకవేళ ఐటీశాఖ పరిశీలనలో అక్రమాలు ఉన్నట్లు తేలితే, తమకు ఎక్కడ కొత్త తలనొప్పులు వస్తాయేనని బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ అని తేలితే గెలిచినోళ్ల ఎన్నిక చెల్లకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని, అదే సమయంలో ఆరేళ్లపాటు పోటీకి అనర్హుడయ్యే అవకాశముందని భయపడిపోతున్నారట. మొత్తానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని అటు గెలిచినోళ్లు ఇటు ఓడినోళ్లు అందరూ హడలెత్తిపోతున్నారట.