చంద్రబాబు దీక్ష రోజే ఇసుక వారోత్సవాలు మొదలు.. మొండిగా వ్యవహరిస్తున్న జగన్

 

ఇసుక కొరత సమస్య ను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కాస్తా విపక్షాల ఆందోళన కారణంగా 2 వారాల నుంచి వరుసగా సమీక్షలు చేస్తున్నారు. 2 వారాల కిందట తొలిసారి సమీక్ష చేసి వారోత్సవాలు నిర్వహించి సమస్య లేకుండా చేస్తామన్నారు. అది కూడా చంద్రబాబు ఇసుక కొరతపై దీక్ష చేయనున్న రోజు నుంచే వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్ణయించారు. గత సమీక్షలో కేవలం ఇసుక సమస్యల పై స్పందన కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత నెలాఖరులోగా వారోత్సవాలు నిర్వహిద్దామని అధికారులకు సూచించారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని ఈ నెల 14 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగమంతా ఇసుక మీదనే పని చేయాలని ఆదేశించారు.

నవంబర్ 3వ తేదీన లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చారు. తాజాగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పై మండిపడ్డారు.విపక్షాల ఇసుక పోరాటాలతో ప్రభుత్వానికి సెగ తగులుతోంది. కూలీలు ప్రతి రోజూ ఎక్కడో చోట ఉపాధి లేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో సహజంగానే ప్రజల్లో అసహనం కనిపిస్తుంది. వరదల పేరుతో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఇసుక బ్లాక్ మార్కెట్ లో ఎలా దొరుకుతోందన్న భావన ప్రజల్లోకి వచ్చింది. పైగా ఇప్పుడు వరదలు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వచ్చే ఇసుక రేటు బ్లాక్ మార్కెట్ రేంజ్ లో ఉంది. ప్రభుత్వం ఇసుక వారోత్సవాలతో సమస్యను పరిష్కరిస్తుందా.? కూలీలందరికీ ఉపాధి దొరికేలా చేయగలుగుతుందా.? ఇంతకాలం వారికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ఇసుక రాజకీయాన్ని ఏ మలుపు తిప్పబోతుంది అనేది వేచి చూడాలి.