జగన్ నిర్ణయం ఫ్యాక్షనిస్ట్ ధోరణా?

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా వేదిక విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దాన్ని కూల్చేయాలని జగన్‌ ఆదేశించారు. ప్రజావేదిక నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిద్దామని, సమావేశం ముగియగానే కూల్చివేత పనులు మొదలుపెట్టాలని జగన్ కలెక్టర్ల సమీక్షలో స్పష్టం చేసారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్.. ప్రజా వేదిక విషయంలో కూడా సంచలన నిర్ణయం తీసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఏదో తన హీరోయిజం చూపించుకోవడం కోసం జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

ప్రజా వేదిక కూల్చివేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజా వేదిక కూల్చివేయడం అంటే ప్రజా ధనాన్ని వృథా చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ చెప్పినట్టు అది అక్రమ నిర్మాణమే అవ్వొచ్చు. కానీ అది దాదాపు రూ.10 కోట్ల ప్రజాధనంతో కట్టిన నిర్మాణం. మరి ఇప్పుడు ఉన్నపళంగా దాన్ని కూల్చేస్తే ఆ డబ్బంతా వృథానే కదా. దానికి తోడు ఇప్పుడు కూల్చడానికి కూడా ప్రజాధనమే ఖర్చు చేయాలి. మరి ఇదంతా నష్టమే కదా. మంగళవారం కలెక్టర్లతో సమీక్ష ముగుస్తుంది. బుధవారం నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టమన్నారు. మరి కలెక్టర్లతో తదుపరి సమీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు. వాటి కోసం మరో నిర్మాణం చేపడతారా. ఏదైనా భవనం అద్దెకి తీసుకుంటారా?. మరి ఇవన్నీ అదనపు ఖర్చులే కదా. ప్రజావేదిక కూల్చివేత పుణ్యమా అని పది కోట్లు బూడిద పాలు అవ్వడమే కాక.. మళ్ళీ ఇవన్నీ అదనపు ఖర్చులు. అంటే జగన్ ఇదంతా ఆలోచించకుండా అక్రమ కట్టడం కూల్చాలంటూ తొందరపడి నిర్ణయం తీసుకొని ప్రజా ధనాన్ని వృధా చేసినట్లే అవుతుంది కదా అంటున్నారు.

సరే అవినీతి మీద, అక్రమ కట్టడాల మీద జగన్ ఉక్కుపాదం మోపుదాం అనుకుంటున్నారు అనుకుందాం. మరి ప్రజావేదిక విషయంలో చూపిన దూకుడు మిగతా కట్టడాల మీద చూపుతారా?. కరకట్ట సమీపంలో పలు అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రజావేదికను వెంటనే కూల్చేయమని చెప్పిన జగన్.. మరి మిగతా అక్రమ కట్టడాలను కూడా వెంటనే కూల్చేయమని చెప్తారా?. ఒకవేళ ప్రజావేదిక విషయంలో చూపిన చొరవ, ఉత్సాహం మిగతా అక్రమ కట్టడాలపై చూపకపోతే మాత్రం జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ప్రజావేదికను ప్రతిపక్ష నాయకుడిగా తనకి కేటాయించాలని చంద్రబాబు లేఖ ద్వారా జగన్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆ లేఖకు బదులివ్వకుండానే ప్రజావేదికను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు కూల్చడానికి సిద్దపడింది. మరి ఇప్పుడు జగన్ సర్కార్ ప్రజావేదికను మాత్రమే కూల్చి మిగతా అక్రమ నిర్మాణాల విషయంలో చూసీచూడనట్టు వదిలిస్తే.. ఇది కచ్చితంగా బాబు మీద కక్ష సాధింపు చర్య అనే అభిప్రాయం వ్యక్తమయే అవకాశముంది. దానికితోడు అసలే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ ఆరోపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజావేదిక ఒక్క నిర్మాణాన్ని మాత్రమే కూల్చితే.. నిజంగానే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ మరింత ప్రచారం చేసే అవకాశముంది. మరి జగన్ వారికి ఆ అవకాశం ఇస్తారో లేదో చూడాలి.