ఏపీలో కాంగ్రెస్ ని చూసి వైసీపీ భయపడుతోందా?

 

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తే మా పార్టీకి ఇబ్బంది అని టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకునే అవకాశముందా?. అబ్బే అసలే ఛాన్సే లేదు అంటారా?. కానీ వైసీపీ ఎందుకో కాంగ్రెస్ ని చూసి ఉలిక్కిపడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్‌ బస్సులను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని నల్లజెండాలతో నిరసన తెలిపారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి భరోసాయాత్ర చేసే హక్కు లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ యాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేదు. అయితే ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేకహోదాని ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తోంది. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద పెడతామని పలుసార్లు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం కాస్త తగ్గింది. అదీగాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోదా విషయంలో మొండిచెయ్యి చూపింది. దీంతో హోదా రావాలంటే కాంగ్రెస్సే మనకున్న ఏకైక మార్గం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు కాస్త సానుకూలంగా స్పందిస్తుండటంతో.. ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపట్టింది. అదేవిధంగా నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. మోదీ మాట ఇచ్చి తప్పిన తిరుపతి సాక్షిగానే ఏపీకి హోదా ఇచ్చి తీరుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఈరోజు బస్సు యాత్రలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు. అయితే వైసీపీ నేతలు యాత్రని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఏపీకి హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ బస్సు యాత్రని అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చింది? అంటే కాంగ్రెస్ వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అందుకే వైసీపీ ఉలిక్కిపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ ఓటు బ్యాంకంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే.. మరి ఇప్పుడు హోదా హామీతో కాంగ్రెస్ కాస్తోకూస్తో బలపడి ఎంతోకొంత ఓట్లు చీలిస్తే వైసీపీకి నష్టమేగా? అందుకే వైసీపీ కాంగ్రెస్ బస్సుకి బ్రేకులు వేయాలని చూస్తుందట. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటైనా గెలుస్తుందో లేదో తెలీదు కానీ.. ఎన్నికలకు ముందే ఓట్లు చీలుస్తుందేమో అని వైసీపీలో భయం కలిగేలా చేసింది. చూద్దాం మరి హోదా హామీతో ఏపీలో కాంగ్రెస్ ఎంతలా బలపడుతుందో.