టీఆర్ఎస్ ఎప్పుడూ వీకే! విపక్షాల బలహీనతే కేసీఆర్ బలం 

తెలంగాణలో మరో మూడు టర్మ్ లు టీఆర్ఎస్ దే అధికారం. తెలంగాణ ప్రజలు కారును తప్ప మరో పార్టీని గెలిపించరు.. ఇదీ టీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చెప్పే మాటలు. కేసీఆర్, కేటీఆర్ ప్రకటనలు వినేవారు నిజంగానే తెలంగాణలో టీఆర్ఎస్ చాలా బలంగా ఉందని నమ్ముతుంటారు. పాలనలో కేసీఆర్ నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి, రాష్ట్ర్ర భవిష్యత్ కు సంబంధించిన కీలక అంశాలపైనా సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిపక్షాలను కనీసం లెక్కలోకి తీసుకోరు. తెలంగాణ మొత్తం తన సొంతమనే తీరుగా ఆయన పోకడలు ఉంటాయనే ఆరోపణలున్నాయి. అయితే తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికతో టీఆర్ఎస్ బలమెంతో తెలిసొచ్చింది. అధికార పార్టీగా ఉండి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది టీఆర్ఎస్, ఎమ్మెల్యే చనిపోవడంతో ఆయన భార్యే పోటీ చేసినా.. ఆ సెంటిమెంట్ ఉన్నా దుబ్బాకలో గట్టెక్కలేకపోయింది గులాబీ పార్టీ. 

 

దుబ్బాక బైపోల్ ఫలితంతో తెలంగాణ రాజకీయాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తమకు తిరుగేలేదనే భ్రమలో ఉన్న టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణలో ఎప్పుడూ టీఆర్ఎస్ బలంగా లేదు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు గొప్పగా ఏమి లేవు, గత ఎన్నికల ఫలితాలను చూస్తేనే ఇది అర్ధమవుతుంది. బోగస్ ఓట్లు, బోటాబోటీ మెజార్టీలు, ఈవీఎం మిషన్లు, కౌంటింగులో అవకతవకలు.. ఇలాంటి అంశాలు కలిసి రావడం వల్లే టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల లెక్కలు చూస్తే ఆ పార్టీ బలమేంటో 
తెలుస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. దుబ్బాక ఫలితంలో ఇది రుజువైందని చెబుతున్నారు. 

 

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని ప్రజలంతా భావించారు. ఆ సమయంలోనే 2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. మేజిక్ ఫిగర్ కు మూడు సీట్లే ఎక్కువొచ్చాయి ఆ పార్టీకి. ఇక ఓట్ల పరంగా చూస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 33. 2 శాతమే. అంటే దాదాపు 67 శాతం మంది తెలంగాణ ఓటర్లు కేసీఆర్ కు , టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నమాట. ఇక గెలిచిన 63 సీట్లలోనూ 10 నియోజకవర్గాల్లో మెజార్టీ 2 వేల లోపే ఉంది. అక్కడ కొంచెం తారుమారైనా గులాబీకి పవర్ దక్కేది కాదు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన ఉద్యమపార్టీ నేతగా వెలుగొందిన కేసీఆర్ కు.. తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 33 శాతం ఓట్లే రావడం నిజంగా అశ్చర్యమే. లెక్కలు ఇలా ఉంటే కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజలంతా తనవెంటే ఉన్నారంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారు. 

 

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించింది టీఆర్ఎస్. అయితే అందుకు సవాలక్ష కారణాలు, ప్రభుత్వ కుట్రలు కనిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచింది గులాబీ పార్టీ. 46.9 శాతం ఓట్లు సాధించింది. గెలిచిన 88లో దాదాపు 15 నియోజకవర్గాల్లో బోటాబోటీ మెజార్టీతో చివరి రౌండ్లలో బయటపడ్డారు టీఆర్ఎస్ అభ్యర్థులు. ఇబ్రహీంపట్నం, కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో మెజార్టీ వందల్లోనే ఉంది. తుంగతుర్తి, వికారాబాద్, కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థులు చివరి రౌండులో గెలిచారు. స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుపై 
చాలా ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నం, ధర్మపురిలో ఎంతగా మెత్తుకున్నా రీకౌంటింగ్ కూడా చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థులు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని, ఈవీఎంలు మార్చారనే ఆరోపణలు వచ్చాయి. ఓడిపోయిన కొందరు అభ్యర్థులు కోర్టుకు కూడా వెళ్లారు. ఇంకా ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి.

 

2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అంశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో దాదాపు 28 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి.   కొన్ని లక్షల కొత్త ఓట్లు రాత్రికి రాత్రే వచ్చి చేరాయి. అధికార పార్టీ కనుసన్నలోనే ఇదంతా జరిగిందని, తమకు ఇబ్బంది కాకుండా ఓటర్ లిస్టులతో మార్పులు చేర్పులు చేసిందనే విపక్షాలు ఆరోపించాయి. కోర్టుకు కూడా వెళ్లాయి. అయితే ఓట్ల తొలగింపునకు సంబంధించిన అప్పటి ఎన్నికల ప్రధానాధికారి కూడా కోర్టులో ఈ విషయాన్నిఅంగీకరించారు. 28 లక్షల ఓట్లు గల్లంతైందని నిజమేనని, కాని ఇప్పుడు చేసేదేమి లేదని, లోక్ సభ ఎన్నికల నాటికి ఓటర్ లిస్టులను సరి చేస్తామని అప్పటి ఎన్నికల అధికారి రజత్ కుమారే స్వయంగా చెప్పారు. 2018లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఇది కూడా ముఖ్య కారణమని విపక్షాలు ఇప్పటికి ఆరోపిస్తూనే ఉన్నాయి.

 

ఓటర్ లిస్టులు సరిచేశాక జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అసలు బలమేంటో తెలిసొచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోపే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కారు పార్టీ ఏకంగా ఏడు సీట్లు కోల్పోయింది. నిజానికి లోక్ సభ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ కార్యకర్తలు అసెంబ్లీ గెలుపు జోష్ లోనే ఉన్నారు. విపక్షాలు ఓటమి నిరాశలోనే ఉన్నాయి. అయినా లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏడు సీట్లు కోల్పోవడం., సీఎం కేసీఆర్ కూతురే నిజామాబాద్ లో ఓడిపోవడం సంచలనమైంది. 2018 డిసెంబర్ లో 88 అసెంబ్లీ సీట్లు గెలిచి రెండోసారి పవర్ చేపట్టిన టీఆర్ఎస్.. ఆరు నెలల్లోనే దాదాపు 55 నియోజకవర్గాల్లో వెనకబడిపోవడం అందరిని అశ్చర్యపరిచింది. బోగస్ ఓట్లు లేకుండా, లక్షలాది ఓట్లను తొలగించకుండా 2018 అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే లోక్ సభకు వచ్చిన ఫలితాలే అప్పుడు కూడా వచ్చేవేమోననే అనే అభిప్రాయం కొన్ని వర్గాలు, రాజకీయ అనలిస్టుల నుంచి వినిపించాయి. 

 

మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణలో టీఆర్ఎస్ అందరూ అనుకున్నట్లుగా బలంగా లేదని, విపక్షాలు బలహీనంగా ఉండటమే కేసీఆర్ బలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దుబ్బాకలో బీజేపీ గట్టి పోరాటం చేయడంతో ప్రజలు ఆ పార్టీని అదరించారని చెబుతున్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉంటామని ఏ పార్టీ నిరూపించుకున్నా.. ఆ పార్టీకి తెలంగాణ ప్రజల మద్దతు దొరికే అవకాశం ఉందంటున్నారు. దుబ్బాక ఫలితం విపక్షాలకు టానిక్ లా మారే అవకాశం ఉందని, రానున్న రోజుల్లో కారు పార్టీకి కష్టాలు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.