సిద్ధార్ధను దేశమే చంపేసిందా?

 


దేశీయ కాఫీ రుచిని విశ్వ వ్యాప్తం చేసిన కాఫీ బ్రాండ్ అంబాసిడర్ 'కేఫ్ కాఫీ డే' ఫౌండర్ దుర్మరణం ఒక వ్యవస్థీకృత హత్య అనేందుకు పలు కారణాలు ఉన్నాయి. ఆయన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంత తీవ్ర చర్యకు నెట్టివేయబడడానికి కారణాలు ఏమిటి ? ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఆయన రాసినట్టుగా భావించబడుతున్న లేఖ అనేక అనుమానాలను లేవనెత్తుతోంది. దేశ వ్యాప్తంగా అనంతమైన ఆవేదనను అంతులేని ప్రశ్నలను మిగిల్చిన సిద్దార్ధ మరణం దేశ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అనేక సమాధానం దొరకని జీవన్మరణ ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రధానంగా ఈ లేఖలో ప్రైవేట్ పెట్టుబడి ప్రదాతలు మరియు ఆదాయ పన్ను అధికారుల వేధింపులు కారణాలుగా కనబడుతున్నాయి. ఈ ప్రైవేటు పెట్టుబడి ప్రదాతలు వారికిచ్చిన వాటాలను తిరిగి కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడం ఒక వ్యవస్థీకృత సమస్య. భారత దేశ కార్పొరేట్ రుణ మార్కెట్ ఒక పనికి మాలిన, పనికి రాని పేలవమైన వ్యవస్థ. షేరు విలువ అప్పు తనఖా కంటే తగ్గిపోయినప్పుడు పారిశ్రామికవేత్తలను అకాల మరణానికి నెట్టివేసే మన దేశం యొక్క చట్టపరమైన రుణ మార్కెట్ ఇన్ఫరాస్ట్రక్చర్ ఒక దివాళాకోరు స్థితిలో ఉంది. 

కాఫీ డే మన దేశంలో ఒక సుప్రసిద్దమైన విజయవంతమైన బ్రాండ్. కాఫీ డే అనే పదం నవ భారత పాప్ సంస్కృతిలో, అలాగే యువత జీవన శైలిలో భాగం అయ్యింది. భారత నగరాలూ, పట్టణాలలో యువత హ్యాంగౌట్ స్పాట్ గా స్టార్ట్అప్స్ కి, సమావేశాలకు ఎన్నో ప్రణయ ప్రేమ బంధాలకు వేదికయ్యింది. ఈ బ్రాండ్ నిర్మాత అయిన సిద్దార్ధ.. ఏ అమెరికా లాంటి ఫంక్షనల్ రుణ మార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉండి ఉంటే.. అతనికి డబ్బు కానీ ఋణం కానీ సమకూరడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. కానీ మన దేశంలో సిద్దార్థ లాంటి పారిశ్రామిక వేత్తలు.. బంధువులు నుండో, మిత్రుల నుండో పీఈ ప్రొవైడర్స్ నుండో డబ్బు తీసుకోవాల్సి వస్తుంది. పీఈ నిధుల కోసం అయ్యే ఫైనాన్సింగ్ ఖర్చు చాలా ఆధికం. వివిధ కార్పోరేట్ ఆస్తులను తనఖాగా ఇవ్వడానికి తగిన న్యాయపరమైన ఆమోదం లేక పోవడం వలన పీఈ నిధులు ఖరీదు గానూ, ప్రమాదంగానూ మారుతున్నాయి.  చాలా సందర్భాల్లో పీఈ పెట్టుబడులను దోపిడీగానే అనుకోవాలి. ఈ సందర్భంలో పీఈ సంస్థలను నిందించి ప్రయోజనం లేదు. మన దేశంలో ఒక శక్తివంతమైన రుణ మార్కెట్ ని అధివృద్ది చేయాల్సిన అవసరాన్ని సిద్దార్ధ మరణం ముందుకు తెస్తోంది. మంచి పరపతి గల కంపెనీలకి, ట్రిపుల్ ఏ రేటెడ్ పేపర్లతో జంక్ బాండ్ లను జారీ చేయగల రుణ మార్కెట్ ని భారత్ అభివృద్ధి చేయాలి. ఋణం, వడ్డీ, కరెన్సీ వంటి అన్ని రకాల రిస్కులను నిరోధించడంతో పాటు సమర్ధవంతమైన, వేగవంతమైన, చట్టపరమైన రుణ మార్కెట్ కల్పన నేటి తక్షణ అవసరం. అలాగే అధికారులు పన్ను చెల్లింపు దారుల మధ్య సహృద్భావమైన సంప్రదింపులు, సంబంధాలు మరింత మెరుగుపడాలి.

పారిశ్రామిక వేత్తలు దోపిడీ దారులు అనే వామపక్ష దురభిప్రాయ సంస్కృతి నుండి దూరం కావాలి. వామపక్ష భావజాలంతో ప్రభావమైన మీడియా.. పారిశ్రామికవేత్తలను దొంగలుగా చిత్రీకరించే ఒక దురలవాటును వదులుకోవాలి. దేశ ఆర్ధిక అభివృద్ధిలో కీలక భూమిక పోషించే వ్యాపారవేత్తలు దేశ నిర్మాతలనే స్పృహతో వ్యవహరించాలి. ఎన్నో ఆర్ధిక, కుటుంబ, సామాజిక ఒత్తిడులను, రిస్కులను తీసుకుంటూ పెళ్ళాం పుస్తెలు, మిత్రుల నుండి అప్పులు చేసి పలువురికి ఉపాధి కలిపిస్తూ.. ప్రత్యక్ష-పరోక్ష పన్నులు చెల్లిస్తూ మరింత మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తూ.. ఇతర అనుబంధ పరిశ్రమలకి వ్యాపారాన్ని ఇస్తూ, సంపద సృష్టిస్తూ, చందాలు, సామజిక కార్యక్రమాలకి నిధులు ఇస్తూ సమాజం యొక్క నిర్దయకు నిష్టూరానికి, నష్టానికి, కష్టాలకి గురి అవుతూ అంతర్ధానం అయ్యే ఎందరో పారిశ్రామిక వేత్తలకు సిద్దార్ధ ప్రాయోపవేశం ఒక ఉదాహరణ.