జగన్ పై దాడి వెనుక నిజంగానే టీడీపీ హస్తముందా?

తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ఒక విషయంపై విపరీతమైన రచ్చ జరుగుతుంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాస్ అనే ఓ యువకుడు సెల్ఫీ కోసమంటూ జగన్ దగ్గరికి వచ్చి.. తన వెంట తెచ్చుకున్న కోడి పందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. జగన్ ప్రాథమిక చికిత్స చేసుకొని.. నార్మల్ గానే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇక అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మారిపోయింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా టీడీపీ ప్రభుత్వం మీద విమర్శల దాడి మొదలు పెట్టారు. కొందరు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ దాడి జరిగిందంటే.. ఇంకొందరేమో అసలు ఈ దాడి చేయించిందే టీడీపీ, ఈ దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. ఇక మరి కొందరైతే ఆ కత్తికి విషం పూసి పొడిచారేమో అంటూ కొత్త అనుమానాలు క్రియేట్ చేసి పార్టీ కార్యకర్తలను భయ భ్రాంతులకు గురిచేసారు. అంతేనా జగన్ భుజానికి గాయం లోతు విషయంలోనూ కన్ఫ్యూజన్. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ లో చికిత్స చేసిన డాక్టర్లు జగన్‌ ఎడమ చేతికి అర సెంటీమీటరు లోతున భుజానికి గాయమైందని చెప్తే.. హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్లు మాత్రం జగన్‌కు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున గాయమైందని, ఆపరేషన్‌ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు. దీంతో వైజాగ్ లో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు.. హైదరాబాద్‌ చేరుకునే సరికి నాలుగు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది. అయితే కత్తికి విష రసాయనాలు పూశారేమో అని నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా శాంపిల్స్‌ను లోతు నుంచి సేకరించాల్సి వచ్చిందని, అందుకే గాయం పెద్దదైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

 

 

సరే ఇదంతా పక్కన పెడితే.. అసలు ఈ దాడికి కారణం టీడీపీ నే అని వైసీపీ బలంగా ఆరోపణలు చేస్తోంది. కానీ ఆరోపణల్లో నిజమెంత?. నిందితుడు శ్రీనివాస్ వెయిటర్ గా పనిచేస్తున్న హోటల్ ఓనర్ టీడీపీ సానుభూతి పరుడు అన్నారు. కానీ ఆ ఓనర్ మాత్రం తాను వైసీపీ అభిమానినని మీడియాతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతెందుకు నిందితుడు శ్రీనివాస్ కూడా జగన్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. నిందితుడి సోదరుడే స్వయంగా మీడియా ముందు చెప్పాడు. 2018 న్యూ ఇయర్ సందర్భంగా నిందితుడు ఒక ఫ్లెక్సీ పెట్టాడు. అందులో అతని ఫోటోతో పాటు జగన్ ఫోటో కూడా ఉంది. ఈ ఫ్లెక్సీ ఫోటో కూడా నిందితుడి సోదరుడి ద్వారా బయటికి వచ్చింది. కానీ ఎవరో ఆ ఫ్లెక్సీ ఫోటోని కూడా మార్ఫ్ చేసారు. ఒక దానిలో జగన్ ప్లేస్ లో చంద్రబాబు ఫోటో.. మరోదానిలో జగన్ ప్లేస్ లో లోకేష్ ఫోటో పెట్టారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు చూసి కొందరు కార్యకర్తలు ఆందోళన, మరికొందరు నిరసన వ్యక్తం చేసారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన నాయకులూ కూడా రెచ్చ కొట్టే వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీడీపీ కూడా వాటిని అంతేస్థాయిలో తిప్పికొడుతోంది. ఎయిర్‌పోర్ట్‌ లో స్థానిక పోలీసులు కాదు సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది ఉంటారు.. వారి కళ్ళుగప్పి నిందితుడు కత్తి ఎలా లోపకి తీసుకెళ్లాడు?.. తనపై దాడి జరిగిన వెంటనే జగన్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా, వారికి సమాచారం తెలపకుండా తన మానాన తాను హైదరాబాద్‌ ఎలా వెళ్లిపోయారు? వైజాగ్ లో స్వల్ప గాయం హైదరాబాద్ వెళ్ళాక పెద్దగా ఎలా అయిందంటూ టీడీపీ నేతలు పలు అనుమానాలు చేసారు. అంతేకాదు గతంలో శివాజీ.. ఆపరేషన్ గరుడలో భాగంగా ఒక ముఖ్య నేతపై ఇలా ప్రాణహాని లేని దాడి జరిపి అల్లర్లు సృష్టిస్తారు అన్నారు. శివాజీ చెప్పినట్టే దాడి జరగడంతో ఇది ఆపరేషన్ గరుడలో భాగమే అని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆపరేషన్ గరుడ కూడా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని ఆరోపిస్తుంది. దీంతో అసలు ఈ దాడి ఏంటో? ఈ దాడి వెనకున్న డ్రామా ఏంటో అర్థంకాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు.

 

 

సరే కాసేపు ఈ దాడి వెనుక టీడీపీ ఉంది అనుకున్నాం. కానీ ఈ దాడి వల్ల టీడీపీకి జరిగే ప్రయోజనం ఏంటని అడిగితే అందరి సమాధానం మౌనం. ఒక నాయకుడి మీద దాడి జరిగితే ఆ దాడి వల్ల ప్రజల్లో ఎంతోకొంత సానుభూతి వస్తుంది. పోయి పోయి ఒక పార్టీ, ప్రత్యర్థి పార్టీ నాయకుడి మీద ఇలాంటి దాడి చేసి సానుభూతి పెంచుతుందా? అంటే అనుమానమే. మరి టీడీపీ మాత్రం ఇంత సిల్లీ దాడి ఎలా చేస్తుంది?. జగన్ ఎప్పటినుంచో పాదయాత్ర చేస్తున్నారు. చాలా నియోజకవర్గాలు కవర్ చేసారు. వందల మీటింగులు పెట్టారు. వేల కిలోమీటర్లు నడిచారు. అయినా జగన్ మీద ఈగ కూడా వాలలేదు. కానీ టైట్ సెక్యూరిటీ ఉండే ఎయిర్‌పోర్ట్‌లో అంత సిల్లీగా దాడి ఎలా జరిగింది?. నిందితుడు అసలు సిబ్బంది కళ్ళు గప్పి ఆ కత్తి ఎలా తీసుకెళ్లాడు? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు.. అక్కడ ఉండే సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది నిర్లక్ష్యం అవుతుంది. అదీగాక నిందితుడు కూడా తాను జగన్ అభిమానిని.. ఆయనని సీఎం చేయాలనే ఆశతో సానుభూతి కోసం ఈ దాడి చేసానని పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒకవైపు విచారణ జరుగుతుంది. పూర్తి వివరాలు బయటికి వస్తాయి. అసలు నిజమేంటో తెలీకుండా కొందరు నేతలు ఇలా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం ఎంత వరకు కరెక్ట్?. ప్రస్తుతం జరిగిందంతా చూస్తుంటే ఈ దాడి వెనుక టీడీపీ ఉందనే ఆరోపణల్లో నిజంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి అసలు ఈ దాడి వెనుక ఉన్న డ్రామా ఏంటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. తెలుసుకుందాం త్వరలో అసలు నిజాలేంటో.