తెలంగాణ ఫ్యూచర్ సీఎం రేవంతేనా? టీకాంగ్ లో సెగలు రేపుతోన్న ఫొటో!

 

తెలంగాణ కాంగ్రెస్ రథసారధి రేవంత్ రెడ్డేనా? తెలంగాణ కాంగ్రెస్ ఫ్యూచర్ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేవంతేనా? రేవంత్ తప్పా... తెలంగాణ కాంగ్రెస్ ను ఇంకెవ్వరూ గట్టెక్కించలేరా? కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే భావనతో ఉందా? రేవంత్ సమర్ధతపై సోనియా, రాహుల్ కి నమ్మకం కుదిరిందా? ఒక్క రేవంత్ మాత్రమే కేసీఆర్ ను దీటుగా ఢీకొట్టగలడని భావిస్తున్నారా? ఇక సీనియర్లను పక్కబెట్టినట్లేనా? ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా నడుస్తున్నాయి. అంతేకాదు రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లంతా ఏకమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ను నియమించబోతున్నారనే ప్రచారంతో, రేవంత్ కు వ్యతిరేకంగా పలువురు సీనియర్లు ఢిల్లీకి క్యూకట్టారనే మాట వినిపిస్తోంది. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని కొనసాగుతున్న సీనియర్లను కాదని, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పీసీసీ పగ్గాలిస్తే ఊరుకునేది లేదని హైకమాండ్ కి అల్టిమేటం కూడా ఇచ్చారట. ఇక వీహెచ్ అయితే రేవంత్ ను డైరెక్ట్ గానే టార్గెట్ చేశారు. టీడీపీ నుంచి వచ్చిన జూనియర్ కు పీసీసీ పగ్గాలు ఎలా ఇస్తారంటూ హైకమాండ్ నే ప్రశ్నించారు.

అయితే, టీకాంగ్రెస్ సీనియర్లు ... రేవంత్ ను టార్గెట్ చేయడం వెనుక ఒకే ఒక్క ఫొటో కారణమనే మాట వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి... ఇటీవల తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి సోనియాగాంధీతో ఫొటో దిగడం.... ఆ ఫొటో కాస్త... పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో విస్తృతంగా రావడం... త్వరలోనే తెలంగాణ పీసీసీ పగ్గాలు రేవంత్ కి ఇవ్వబోతున్నారనే ప్రచారం జరగడంతో... సీనియర్లు కలవరపాటుకు గురయ్యారట. ఇంత సడన్ గా రేవంత్ తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లి సోనియాతో ఫొటో దిగాడంటే, నిజంగానే రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించబోతున్నారనే నిర్ణయానికి వచ్చి, అటాక్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

 

 

ఇక, అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎవ్వరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని సోనియాగాంధీ, కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఎందుకు ఇచ్చారనే చర్చ, పార్టీలో జోరుగా సాగుతోంది. అధిష్టానం రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం వల్లే, సోనియగాంధీ, రేవంత్ కుటుంబంతో కలిసి ఫొటో దిగారని భావిస్తున్నారు. దాంతో సీనియర్లంతా కలిసి రేవంత్‌కు పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఢిల్లీలో మకాంవేసిన పలువురు సీనియర్లు... జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని కోరుతున్నారట. మరి రేవంత్ కు నిజంగా పీసీసీ పగ్గాలు అప్పగించబోతున్నారో లేదో తెలియదు గానీ, సీనియర్లు మాత్రం రేవంత్ కు వ్యతిరేకంగా ఏకమై ఢిల్లీలో పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారట.