ఇతనా ప్రధాని అవ్వాలనుకునేది?

 

 

 

అమ్మ సోనియమ్మ కలలన్నీ ఫలించి, చేయాలనుకున్న అడ్డగోలు విభజన వర్కవుటై, ఈదేశాన్ని ఏ రాహు గ్రహమో వక్రంగా చూస్తే రాహుల్‌గాంధీ భారత ప్రధాని అయిపోవడం ఖాయం. జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి లాంటి మహామహులు అధిష్టించిన భారత ప్రధాని కుర్చీమీద రాహుల్ గాంధీ లాంటి అనుభవశూన్యుడు, వారసత్వం తప్ప మరే సత్వం లేని రాహుల్ గాంధీ కూర్చుంటే ప్రజలు ఆ పదవికి ఉన్న గత వైభవాన్ని తలచుకుని బాధపడటం తప్ప మరేం చేయగలరు?

 

 

పైన చెప్పిన మహానుభావులతో పోల్చుకుంటే  ఏ విషయంలో అయినా రాహుల్ గాంధీ సరితూగగలడా? సరి తూగకపోతే పోయాడు అడ్జస్ట్ అయిపోదామనుకుంటే అయ్యగారి బిహేవియర్, మాట్లాడే పద్ధతి ఏమైనా పద్ధతిగా ఉంటాయా? ప్రధానమంత్రి పదవికి పోటీపడే వ్యక్తి స్థాయిలో మచ్చుకైనా వుంటాయా? అర్హతని మించిన పదవీకాంక్ష, రాజ్యాంగేతర శక్తిలా ఉండే వ్యవహారశైలి, ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియనితనం.. ఈ లక్షణాల కలబోతగా ఉండే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా ఊహిస్తేనే ఏదోలా అనిపించదా? రాహుల్ గాంధీ తనను తాను ఒక్కసారి పరిశీలించుకుంటే, తానేంటి.. ఈ దేశానికి ప్రధాని అవ్వాలనుకోవడమేంటని అనిపించదా?