ఒక పరాజయం 100 తప్పులు.. బాబు పవన్ మధ్య చిచ్చు పెట్టిన లోకేష్!

 

2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకున్న టీడీపీ.. తరువాత ఆయనను దూరం చేసుకొని తప్పు చేసిందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలు టీడీపీ, వైసీపీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా జరిగాయి. చాలా తక్కువ తేడా ఓటు శాతంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ,జనసేనలు మద్దతిచ్చాయి. బీజేపీ వల్ల టీడీపీకి ఎంత ప్లస్ అయిందో చెప్పలేం కానీ జనసేన వల్ల మాత్రం టీడీపీకి కచ్చితంగా ప్లస్ అయిందనే చెప్పాలి. పవన్ కి యూత్ లో ఉన్న క్రేజ్ టీడీపీకి ప్లస్ అయింది. అలాగే మెజారిటీ కాపు సామాజికవర్గ ఓట్లు కూడా టీడీపీకి పడ్డాయి అంటారు. అంటే 2014 లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కూడా కారణమని చెప్పవచ్చు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తరువాత.. టీడీపీ, జనసేనల మధ్య గ్యాప్ మొదలైంది. పవన్ టీడీపీకి దూరమై టీడీపీని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అది నచ్చని టీడీపీ నేతలు ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టారు. అలా పవన్ ని, పవన్ అభిమానుల్ని టీడీపీ దూరం చేసుకుంది.

అయితే పవన్ టీడీపీకి దూరమవ్వడానికి కారణం లోకేష్ అని పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది. టీడీపీ గెలవడానికి పవన్ కారణం కాదు, పవన్ లేకపోయినా టీడీపీ గెలుస్తోంది అంటూ కొందరు లోకేష్ ని రెచ్చగొట్టడంతో.. లోకేష్ పవన్ పై చులకన వ్యాఖ్యలు చేశారట. ఈ విషయం పవన్ కి తెలియడంతో.. ఆయన హర్ట్ అయి టీడీపీకి దూరంగా జరిగారట. అందుకే పవన్ టీడీపీకి దూరమయ్యాక లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు అని అంటుంటారు. ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబే.. పవన్ ని దూరం పెట్టి డైరెక్ట్ చేసారని ఆరోపణలు వినిపించాయి. ఇదే విషయాన్నీ ఎన్నికలకు ముందు వైసీపీ పదేపదే ప్రస్తావిస్తూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ పనితీరుపైన, అవినీతి పైన ప్రతిపక్ష వైసీపీ కంటే.. పవన్ వేసిన వ్యాఖ్యలే జనంలోకి బలంగా వెళ్లాయని, అది టీడీపీకి తీవ్ర నష్టం చేసిందని అంటారు. అదేవిధంగా పవన్ దూరమవడంతో యూత్ ఓట్లు కూడా టీడీపీ దూరమయ్యాయి. మెజారిటీ యూత్ పవన్ కి, జగన్ కి జై కొట్టారు. మొత్తానికి తెలిసో తెలియకో పవన్ ని దూరం చేసుకొని టీడీపీ తప్పు చేసిందని చెప్పక తప్పదు.