కేసీఆర్ మహాకూటమికి చెక్ పెట్టాలని జగన్, పవన్ ని దింపుతున్నారా?

 

తెరాస 100 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ అధికారం తామే చేపడతామని ధీమా వ్యక్తం చేస్తూ ముందస్తుకు సిద్ధమైంది. అయితే తెరాస ఊహించినట్లు 100 సీట్లైతే రావడం కష్టం కానీ.. మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని అందరూ భావించారు. ఇదంతా ఒకప్పటి మాట. ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉంది కానీ తెరాసను అధికారానికి దూరం చేసే అంత బలం లేదని మొన్నటివరకు అందరూ భావించారు. కానీ ఇప్పుడు మహాకూటమితో కాంగ్రెస్ బలం పెరిగింది. ముఖ్యంగా నాయకులు దూరమైనా కేడర్ ఉండి.. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న టీడీపీ బలం కాంగ్రెస్ కు కలిసొస్తుంది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ నువ్వానేనా అన్నట్టు జరిగే అవకాశాలున్నాయి. ఇదే ఇప్పుడు తెరాసను కలవరపెడుతోంది. మహాకూటమిని ఓడించి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మహాకూటమిని అడ్డుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని కేసీఆర్ భావిస్తున్నారట. దానిలో భాగంగానే అవసరమైతే జగన్, పవన్ లను అస్త్రాలుగా మలుచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారట.

ప్రస్తుతం జగన్, పవన్ ల దృష్టంతా వచ్చే ఏపీ ఎన్నికల మీదే ఉంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని ఎవరికి తోచిన దారిలో వారు అడుగులు వేస్తున్నారు. అయితే వీరి అడుగులు తెలంగాణలో పడితే ఎలా ఉంటుందా అని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. నిజానికి తెలంగాణలో వైసీపీ, జనసేన పార్టీలు అసలు ఉన్నాయా? అనే పరిస్థితి. 2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది కానీ వాళ్ళు ఎన్నికల అనంతరం పార్టీని వీడారు. ఉన్న కేడర్ కూడా దూరమైంది. దీంతో జగన్ పార్టీని ఏపీకే పరిమితం చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. మరి అలాంటిది కేసీఆర్ వైసీపీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే దానికో కారణం ఉందట. వైసీపీని కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని స్థానాల్లో బరిలోకి దింపితే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీదున్న అభిమానంతో కొందరు కాంగ్రెస్ ఓటర్లు వైసీపీకి ఓటేసే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారట. దీనివల్ల కాంగ్రెస్ కి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అలాగే జనసేన బరిలోకి దిగితే కూడా తెరాసకు ఎంతోకొంత లాభం ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారట. మహాకూటమి బలంగా ఉన్న స్థానాల్లో జనసేనను బరిలోకి దింపితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు చీలిపోయి తెరాసకు లాభం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ కేసీఆర్ మహాకూటమిని అడ్డుకోవడానికి వైసీపీ, జనసేనని రంగంలోకి దింపుతారా అంటే నమ్మడానికి కష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీగాక బలంలేని తెలంగాణలో పోటీ చేసి వైసీపీ తన పరువు తాను తీసుకునే సాహసం చేయకపోవొచ్చు. ఇక జనసేన విషయానివస్తే తెలంగాణలో పార్టీ నిర్మాణమే జరగలేదు. ఇప్పటికిప్పుడు సరైన అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. మరి ఇలాంటి సమయంలో పవన్ తొందరపడి పార్టీకి నష్టం జరిగే స్టెప్ వేయకపోవొచ్చు. చూద్దాం మరి మహాకూటమిని అడ్డుకోవడానికి కేసీఆర్ ముందు ముందు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో ఏంటో.