కేసీఆర్ ఢిల్లీ టూర్.. బీజేపీ రాజకీయమేనా?

 

తాజాగా కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కళ్ళ పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లినట్టు అధికారంగా తెలిపారు. కంటి వెలుగు పథకంతో లక్షలమంది ఇళ్లలో వెలుగు నింపామని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రంలో డాక్టర్లు లేనట్టు కంటి పరీక్ష కోసం ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? పేదవాడికి ఓ వైద్యం, కేసీఆర్ కో వైద్యమా? అంటూ కేసీఆర్ టూర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళింది కంటి పరీక్ష కోసం కాదు.. త్వరలో రాబోతున్న ఎన్నికల పరీక్ష కోసమని తెలుస్తోంది.

గత కొంతకాలంగా కేసీఆర్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం కుదిరింది అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రహస్య ఒప్పందం గురించి మరిన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ బీజేపీ నాయకులతో చర్చలు జరపడానికే ఢిల్లీ వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా బీజేపీ సికింద్రాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్స్ లో యువభేరి పేరుతో సభ నిర్వహించింది. ఆ సభకు ఆదివారం నాడు అమిత్ షా హాజరయి.. సాయంత్రం ఢిల్లీ వెళ్లిపోయారు. అదే రోజు సాయంత్రం కేసీఆర్ కూడా కంటి పరీక్షల కోసమని ఢిల్లీ వెళ్లి మరుసటి రోజు తిరిగొచ్చారు. వీరిద్దరూ కలిసి ప్రయాణమైతే చేయలేదు కానీ.. ఢిల్లీలో రహస్యంగా కలుసుకొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి మంతనాలు జరిపినట్టు న్యూస్ హల్చల్ చేస్తోంది.

తెరాస, బీజేపీలు అప్పుడప్పుడు ఒకరిమీద ఒకరు పైకి విమర్శలు చేసుకుంటున్నారు కానీ.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని.. ఆ విషయం బయటపడితే ఎక్కడ మజ్లిస్ దూరమవుతుందోనన్న భయంతోనే.. తెరాస బయటపడట్లేదు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కేసీఆర్ తో ఢిల్లీలో బీజేపీ నేతలు ఒక డీల్ చేసుకున్నారట. మజ్లిస్ కంటే కనీసం ఒక్కసీటైనా తమకు ఎక్కువ వచ్చేలా చేయాలని బీజేపీ కేసీఆర్ ని కోరిందట.. దానికి బదులుగా మిగతా స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చి.. మళ్ళీ మీకే అధికారం దక్కేలా చేస్తామని చెప్పిందట. దీనికి కేసీఆర్ కూడా సరే అన్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరి కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతలతో రహస్య మంతనాలు జరిపారనే వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ.. ప్రస్తుతం తెలంగాణలోని పరిస్థితులు చూస్తుంటే రహస్య ఒప్పందం నిజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి కొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ కాస్త బలంగా ఉన్న ఉప్పల్ లో తెరాస బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదు.. నాలుగు బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో తెరాస అసలు అభ్యర్థులనే ప్రకటించలేదు. ఇక తెలంగాణలో బీజేపీ బలం విషయానికొస్తే ఐదు, పది సీట్లు కూడా రావడం కష్టమే. అలాంటి బీజేపీ.. తెరాస, మహాకూటమి మీద విమర్శలు చేస్తూ.. అధికారంలోకి వస్తామని చెప్తూ.. పలు చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇవన్నీ చూస్తుంటే.. అధికారం నిలుపుకోవాలని తెరాస, తెలంగాణలో ఉనికి చాటుకోవాలని బీజేపీ.. రహస్య ఒప్పందం కుదుర్చుకొని ఇలా అడుగులు వేస్తున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ రహస్య ఒప్పందం, పరస్పర సహకారం వార్తల్లో నిజమెంతో ఆ పై వాడికే తెలియాలి.