జగన్ సాయం ప్రకటనలకే పరిమితమా.. కోటి మాటేమిటి?

 

తిత్లీ తుఫాన్ రూపంలో శ్రీకాకుళంని కష్టం ముంచెత్తింది. తిత్లీ బాధితుల కన్నీళ్లు తుడవడానికి, వారికి అండగా నిలబడడానికి పలువురు ముందుకొస్తున్నారు. కొంత మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా విరాళాలు ప్రకటించాయి. హెరిటేజ్ సంస్థ రూ. 66 లక్షల చెక్కును సీఎంకి అందించింది. ఇక సీఎం చంద్రబాబు అయితే తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. ఇలా ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా రూ. కోటి సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అయితే వైసీపీ రూ. కోటి సాయం ప్రకటనకే పరిమితమా అంటూ చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే వైసీపీ ఆ కోటిని సీఎం సహాయనిధికి ఇచ్చినట్లు కానీ లేదా మరేదైనా మార్గంలో సాయం చేసిన దాఖలాలు కానీ లేవు. దీంతో వైసీపీ కోటి సాయం ప్రకటనకే పరిమితమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే గతంలో వైసీపీ ప్రకటించిన ఆర్థికసాయాల విషయంలో కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్ ను హుదూద్ కుదిపేసినప్పుడు.. జగన్ రూ. 50 లక్షల సాయం ప్రకటించారు. ప్రభుత్వానికి ఇవ్వబోమని వైఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో ఖర్చు పెడతామని తన పత్రికలో ప్రకటించి పాఠకుల దగ్గర్నుంచి విరాళాలు సేకరించారు. ఇలానే అప్పట్లో మరో ప్రముఖ పత్రిక కూడా సేకరించి మత్య్సకారులకు ఇళ్లను కట్టించింది. కానీ జగన్ ప్రకటించిన ఆ రూ. 50 లక్షలు.. సేకరించిన విరాళాలను ఏ విధంగా ప్రజలకు సాయం అందించారో బయటపెట్టలేదు.

ఇక కేరళ వరదల సమయంలో సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు ఎవరికి తోచిన సాయం వారు చేసి కేరళకు అండగా నిలబెట్టారు. ఆ సమయంలో జగన్ కూడా కోటి సాయం ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆయన ప్రకటించిన సాయాన్ని కేరళకు అందించలేదని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం.. తన కంపెనీ తరపున కేరళకు రూ. కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు కేరళకు వెళ్లి సీఎంకు ఇచ్చి వచ్చారు. కానీ జగన్ చేసిన సాయం మాత్రం బయటకు రాలేదు. తమ పార్టీ వాళ్లే కాబట్టి వాళ్లు చేసినా నేను చేసిన ఒకటే అనుకున్నారా? ఏంటో తెలియట్లేదు. మరి జగన్ వైజాగ్ కు ప్రకటించిన రూ. 50 లక్షలు, కేరళకు ప్రకటించిన రూ. కోటి.. ప్రకటనకే పరిమితం చేసారా? లేక నిజంగానే సాయం చేసారా?. ఒకవేళ సాయం చేసుంటే సోషల్ మీడియాలో, సొంత మీడియాలో గట్టిగానే ప్రమోషన్ చేసేవాళ్లుగా?. దీనిబట్టి చూస్తుంటే ఆ సాయం ప్రకటనలకే పరిమితం అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి తిత్లీ బాధితుల కోసం ప్రకటించిన రూ. కోటి సాయమైనా బాధితులకు చేరుతుందా? లేక ప్రకటనగానే మిగిలిపోతుందా?. లేదా అసలు ఇవన్నీ ఆరోపణలు మాత్రమే.. మా సాయం ప్రకటనలకే పరిమితం కాదు.. సాయం చేసి చూపిస్తామని నిరూపించుకుంటారా?. చూద్దాం ఏం జరుగుతుందో.