హుజూర్ నగర్ లో చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతోంది?

 

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థినిగా చావా కిరణ్మయి ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రచారానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రావాలని కొందరు, అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతు ఉండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహా కూటమి పేరుతో టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. అంతేకాదు అన్ని పార్టీల నాయకులు కలిసి ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు తెలంగాణలో రెండు విడతలుగా వారం రోజుల పాటు గట్టిగానే ప్రచారం నిర్వహించారు. అయితే ఖమ్మం జిల్లాలో తప్ప టీడీపీ ఎక్కడా గెలవలేకపోయింది. ఆ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ప్రచారం కాంగ్రెస్ కు బెడిసికొట్టిందని ఆ పార్టీ నాయకులు ఓపెన్ గానే ప్రకటించారు.

దాంతో ఈ సారి హుజూరునగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కోసం చంద్రబాబు ప్రచారం చేస్తారా చెయ్యరా,చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఏమవుతుంది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమిలో సీట్లు మాత్రమే పంచుకున్న టిడిపి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దత్తు మాత్రమే చేసి పోటీకి దూరంగా ఉంది. దాంతో తెలంగాణలో టిడిపి ఉనికి ప్రశ్నార్ధకంగా తయారైంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డ టిడిపి నేతలు డీలా పడిపోయారు. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు అధిష్ఠానం తెలంగాణ టిడిపిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ఏపీలో టిడిపి ఓడిపోవటంతో తెలంగాణ పై దృష్టి సారించడమే కాకుండా పార్టీకి పునఃవైభవం తెస్తానని ప్రకటిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయానికి వస్తే బాబు ప్రచారం చేస్తే ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉన్న హుజూర్ నగర్ లో ఆంధ్రా ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని పోటీ చేసిన టిడిపికి ఇరవై ఐదు వేల ఓట్లు దక్కాయి. ఇక రెండు వేల పధ్ధెనిమిదిలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని ప్రస్తుత అభ్యర్థిని కిరణమై భావించినప్పటికీ పొత్తుల కారణంగా సాధ్యపడలేదు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా పార్టీ అధినేత ప్రచారం చేస్తే అంతో ఇంతో ప్లస్ అవుతుందని అంటున్నారు.ఇక పై టీడీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.