ఇరాన్ మరో ఉత్తరకొరియా అవుతుందా..?

అమెరికాతో సహా ప్రపంచదేశాలు చేస్తోన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వరుస పెట్టి అణు, క్షిపణి పరీక్షల ప్రయోగాలను నిర్వహిస్తోంది ఉత్తర కొరియా..ఏకంగా జపాన్ భూభాగం మీదుగా క్షిపణిని ప్రయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేసింది. ముఖ్యంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు ఎప్పటికప్పుడు కవ్వించే మాటలతో యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు.

 

ఆ వేడి చల్లారకపోగా..మధ్యలో ఇప్పుడు ఇరాన్ తయారైంది. అమెరికా హెచ్చరికలను, ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. మధ్యంతర శ్రేణికి చెందిన మిస్సైల్‌ను తాము ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ది కొర్రామార్ష్ శ్రేణికి చెందిన ఈ క్షిపని సుమారు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒకటి కంటే ఎక్కువ వార్‌హెడ్స్‌ను ఇది మోసుకెళ్లగలదు..ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, చైనా, రష్యా, యూరప్‌, ఆఫ్రికా, భారత్‌లోని పలు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయని రక్షణ నిపుణులు తెలిపారు.

 

ఈ క్షిపణిని గత శుక్రవారం జరిగిన సైనిక పేరేడ్‌లో ప్రదర్శించారు. అయితే తమ దేశం క్షిపణి ప్రయోగాలకు దిగుతుందని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ ముందే క్లూ ఇచ్చారు. ఇరాన్‌ అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుందని జాతినుద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ఈ ప్రకటన చేసిన మర్నాడే క్షిపణిని పరీక్షించడం గమనార్హం. మరోవైపు ఇరాన్ చర్యలపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఫ్రాన్స్ కూడా ఇరాన్ తీరును నిరసించింది. ఇరాన్ కూడా మరో ఉత్తరకొరియాలా తయారవుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ అన్నారు.