ఏపీలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. జగన్ ఉద్దేశం అదేనా?

ఏపీ పోలీసు శాఖలో చేపడుతున్న సంస్కరణలకు కొత్త ఊపు తెచ్చే క్రమంలో జగన్ సర్కారు మంగళవారం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో కీలక విభాగాల్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. తాజా బదిలీల్లో భాగంగా వెయిటింగ్ లో ఉన్న నలుగురు ఐపీఎస్ లకు పోస్టింగ్ దక్కింది.

దిశ చట్టం అమలుతో పాటు అవినీతి నిర్మూలన, ఎక్సైజ్, పాలనా సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వం గతేడాది నవంబర్ లో పలువురు కీలక ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆ తర్వాత మంగళవారం మరోసారి 8 మంది ఐపీఎస్ అధికారులకు స్ధానభ్రంశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి కిశోర్ కుమార్ తో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ లు ఉన్నారు. కిశోర్ కుమార్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వం ఆయన్ను ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ గా బదిలీ చేసింది. ఆయన స్ధానంలో పోస్టింగ్ కోసం ఎధురుచూస్తున్న మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్ కుమార్ విశ్వజిత్ కు హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా అవకాశం కల్పించింది. వెయిటింగ్ లో ఉన్న మరో సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యాన్ని రైల్వే అదనపు డీజీగా నియమించింది. వీరిద్దరితో పాటు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కుమార్ నాయక్ కు సీఐడీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. వెయిటింగ్ లో ఉన్న మరో ఐపీఎస్ అభిషేక్ మహంతిని గ్రేహౌండ్స్ అడ్మిన్ విభాగంలో గ్రూప్ కమాండర్ గా నియమించింది. అమరావతి భూముల వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగాన్ని బలోపేతం చేసే క్రమంలో సునీల్ కుమార్ నాయక్ కు డీఐజీగా బాధ్యతలు అప్పగించింది. గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ కు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది.

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా ఉన్న కృపానంద్ త్రిపాఠీ ఉజేలాతో పాటు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరికుమార్ కు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజాగా చోటు వెలుగుచూస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడంలో చురుగ్గా వ్యవహరించలేదనే కారణంతో త్రిపాఠిని డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న తాజా పరిణామాలే హరికుమార్ బదిలీకి కారణమైనట్లు సమాచారం.

గతేడాది ఏపీలో వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక పలుమార్లు ఆలిండియా సర్వీసు అధికారుల బదిలీలను చేపట్టింది. తొలిసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ పాలనపై పట్టు పెంచుకునే క్రమంలో తరచూ బదిలీలు చేపడుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను క్షేత్రస్ధాయికి తీసుకెళ్ళడంలో చురుగ్గా వ్యవహరించకపోవడం, పలు ఆరోపణలతో కొందరు అధికారులను తరచూ బదిలీలు చేస్తున్నారు. అవినీతి నిర్మూలనపై పట్టుదలగా ఉన్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇందులో ఎంతటి స్ధాయి అధికారులైనా ఉపేక్షించేది లేదనే సంకేతాలు ఇవ్వడం తాజా బదిలీల వెనుక మరో ఉద్దేశంగా కనిపిస్తోంది.