ప్రేమే ఆధారం


మనుషులలో అనేక అనుభూతులు ఉంటాయి కదా! అవన్నీ కలిసి ఓసారి షికారుకని బయల్దేరాయట. చక్కగా ఆడుతూ పాడుతూ ఆ అనుభూతులన్నీ ఒక ద్వీపం మీద సేదతీరుతున్నాయి. ఇంతలో ఆకాశం నల్లబడిపోయింది. ఎటు చూసినా దట్టమైన మబ్బులు. ఆ మబ్బుల మధ్య నుంచి చీల్చుకువస్తున్న మెరుపులు. మరికాసేపట్లో జోరున హోరున వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

 

వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం చూసి అనుభూతులన్నీ కలత చెందాయి. అక్కడే ఉంటే ఆ వర్షంలో నిలువ నీడ లేకుండా తడిసి ముద్దైపోక తప్పదు. తమ పడవులన్నీ కొట్టుకుపోకా తప్పదు. అందుకని తలా ఒక పడవ తీసుకుని అవి సురక్షిత తీరం వైపుగా బయల్దేరాయి. ఈ హడావుడిలో పాపం ప్రేమ అనే అనుభూతికి ఏ పడవా కనిపించలేదు. దాంతో తనని తీరానికి ఎవరన్నా తీసుకువెళ్తారేమో అనుకుంటూ ఆందోళనగా అటూఇటూ చూసింది.

 

సాయం కోసం వెతుకుతున్న ప్రేమకు, ఆడంబరం అనే అనుభూతి పడవ నడిపేందుకు సిద్ధపడుతూ కనిపించింది. ‘ఓ నేస్తమా! నన్ను కూడా కాస్త నీ నావలో ఎక్కించుకోవా!’ అంటూ ఆడంబరాన్ని ప్రాధేయపడింది ప్రేమ. ‘నిన్ను నా పడవలో ఎక్కించుకోవడమా! అసలే నా పడవ రకరకాల సంపదలతో కిక్కిరిసిపోయి ఉంది. గుట్టలు గుట్టలుగా బంగారం, కుప్పలుతెప్పలుగా బట్టలు, ప్రశంసాపత్రాలు, సన్మానపు శాలువలలతో నా పడవ నిండిపోయింది. ఇక నీకు చోటెక్కడ ఉంది చెప్పు,’ అంటూ హడావుడిగా సాగిపోయింది.

 

ఆడంబరం తనని కాదని వెళ్లిపోవడంతో మరో నావ కోసం ప్రేమ ఎదురుచూడసాగింది. ఇంతలో దానికి అహంకారం అనే అనుభూతి నావని తోసుకుంటూ కనిపించింది. ‘నేస్తమా! కాస్త నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్లవా?’ అని బతిమాలింది ప్రేమ. ‘హహ్హా! అసలు నీ వాలకం చూశావా. జిడ్డు మొహం, మట్టి కాళ్లు. నువ్వు కనుక నీ మట్టి కాళ్లతో నా పడవ ఎక్కావంటే నా పడవ విలువ తగ్గిపోతుంది. అసలు నా కళ్ల ముందు నుంచి అవతలికి ఫో!’ అంటూ విసుక్కుంది.

 

ఇలా ప్రేమ ఒకొక్కరినే తనకి సాయం చేయమని వేడుకుంది. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నవారే! దుఃఖం అనే అనుభూతేమో తన బాధలో తాను మునిగిపోయి ప్రేమని పట్టించుకోలేదు. సుఖం అనే అనుభూతేమో ఆనందంతో గంతులు వేస్తూ అసలు తన చుట్టూ ఎవరు ఏ బాధ పడుతున్నారో గమనించుకోవడమే లేదు.

 

ప్రేమ అలా దిక్కుతోచకుండా నిలబడి ఉండగా హఠాత్తుగా ఎవరో ‘ఓయ్! ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు. రా నువ్వు కూడా నా పడవలోకి ఎక్కు. తుపాను మొదలయ్యేలోగా మనం ఆవలి తీరానికి చేరుకుందాం,’ అంటూ ప్రేమని పిలిచారు. ఆ కొత్త వ్యక్తిని ప్రేమ ఇంతకు ముందు గమనించనేలేదు. అయినా మారుమాటాడకుండా అతని నావని ఎక్కి కూర్చుంది. ఇద్దరూ కాసేపటికి ఆవలి తీరానికి చేరుకున్నారు.

 

ప్రేమ అప్పటిదాకా అణచుకున్న ఆసక్తిని ఇక దాచుకోలేకపోయింది. ‘ఇన్ని అనుభూతులు నన్ను కాదని వెళ్లిపోయినా నువ్వు మాత్రం నాకు తోడుగా ఉన్నావు. ఎవరు నువ్వు? నిన్ను పెద్దగా చూసినట్లు తోచడం లేదే!’ అని అడిగింది.

 

‘నేను శాంతిని. చాలా అరుదుగా కనిపిస్తాను. ఆ ప్రపంచంలో ఆడంబరం, అహంకారం, సుఖం, బాధ... అన్నీ ఎక్కడపడితే అక్కడ కనిపించేవే. కానీ వీటిలాగా నేను సులువుగా దక్కను. పైగా అవన్నీ తాత్కాలికం కాబట్టి వాటిని ప్రపంచం వాటిని నమ్ముకుని ఉపయోగం లేదు,’ అని చెప్పుకొచ్చింది.

 

‘బావుంది. మరి అవన్నీ నన్ను కాదని వెళ్లిపోతే నువ్వు మాత్రం నాకెందుకు సాయం చేశావు!’ అని అడిగింది ప్రేమ.

 

‘ఎందుకంటే నాకు నీ విలువ తెలుసు కాబట్టి. నేను మనుగడ సాగించడానికి ఆడంబరం, అహంకారం, సుఖం వంటి అనుభూతుల అవసరం లేదు. పైగా అవి నాకు అడ్డంకి కూడా. కానీ ప్రేమ ఉన్నచోటే శాంతి విరుస్తుంది. ప్రేమతోనే మనిషి మనసైనా, ఈ ప్రపంచమైన ప్రశాంతంగా ఉంటుంది,’ అని చెప్పుకొచ్చింది శాంతి.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.