ఇంటర్నెట్‌తో మానసిక వ్యాధులు

ఒకప్పుడు ఇంటర్నెట్‌ అంటే అదో విలాసం. అందులో ఏమన్నా సమాచారం వెతకాలంటే ఎక్కడెక్కడికో వెళ్లి వందలకొద్దీ రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఆ సమాచారం కూడా నిక్కుతూ నీలుగుతూ నిదానంగా ‘లోడ్‌’ అయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇంటింటా ఇప్పుడు ఇంటర్నెట్‌ రాజ్యమేలుతోంది. సాంకేతిక విప్లవం పుణ్యమా అని గంపల కొద్దీ సమాచారం సెకన్లలో కంప్యూటర్లో మెదుల్తోంది. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక సైట్ల విజృంభణా తక్కువేం లేదు. మరి కళ్ల ముందు ఇంత ప్రపంచం కనిపిస్తోంది కదా అని, కదలకుండా కూర్చునేవారి పరిస్థితి ఏంటి?

 

ఇంటర్నెట్‌ ఎడిక్షన్‌ టెస్ట్‌ 

ఇంటర్నెట్‌ మీద ఎక్కువసేపు గడిపేవారిలో ఇతరత్రా మానసిక వ్యాధులు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అన్న సందేహం వచ్చింది, కొందరు కెనడా పరిశోధకులకి. సందేహం వచ్చిందే తడవు, ఓ 254 మందిని విద్యార్థులను ఎన్నుకున్నారు. అలా ఎన్నుకొన్నవారిలో ఇంటర్నెట్ వాడకాన్ని పరిశీలించారు. ఈ 254 మందిలో ఓ 33 మందిలో ఇంటర్నెట్‌ పట్ల విపరీతమైన వ్యసనం ఉన్నట్లు తేలింది.

 

వ్యాధుల గంప

ఇంటర్నెట్‌ వ్యసనం ఉన్న వారిలో రకరకాల మానసిక సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. విపరీతమైన క్రుంగుబాటు, ఉద్వేగం, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి ఇబ్బందులను వారు ఎదుర్కొన్నట్లు తేలింది. ఇంటర్నెట్‌ను వాడేవారిలో ఈ కింది గణాంకాలను కూడా పరిశోధకులు నమోదు చేశారు.

- ఒక 56 శాతం విద్యార్థులు వీడియోలకి సంబంధించిన సైట్లకి అతుక్కుపోతున్నారట.

- 48 శాతం మంది విద్యార్థులైతే సోషల్‌ మీడియా సైట్లను వదిలి ఉండలేకపోతున్నారు.

- విద్యార్థులలో 29 శాతం మంది ఇన్‌స్టంట్ మెసేజింగ్ సైట్లను పట్టుకుని వేళ్లాడుతున్నారు.
మొత్తం మీద ఇంటర్నెట్‌ ఓ వ్యసనంగా ఉన్నవారిలో 42 శాతం మంది నానారకాల మానసిక ఇబ్బందులనూ ఎదుర్కొంటున్నారు.

 

కొత్త కోణం

ఇప్పటివరకూ మనస్తత్వ వైద్యలు తమ వద్దకు వచ్చే మానసిక రోగుల జీవితంలో ఇంటర్నెట్ ప్రాముఖ్యతని అంతగా గమనించనేలేదు. కానీ ఇక మీదట ఇంటర్నెట్‌ వాడకాన్ని కూడా ఒక లక్షణంగా భావించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంతేకాదు! ఇప్పుడు ఇంటర్నెట్ వ్యసనం అనేది రెండు రకాల ప్రమాదాన్ని మన ముందు ఉంచుతోంది. ఒకటి- ఏదన్నా మానసిక వ్యాధి ఉన్న వ్యక్తుల, ఆ వ్యాధి కారణంగా ఇంటర్నెట్‌కు మరింతగా వ్యసనపరులు కావడం; రెండు- తెలియకుండా ఇంటర్నెట్‌ మీద ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారు, నిదానంగా ఏవో ఒక మానసిక ఇబ్బందులకు లోను కావడం. ఎలా చూసినా అవసరానికి మించిన ఇంటర్నెట్ వాడకం నష్టమేనని రుజువవుతోంది. తస్మాత్‌ జాగ్రత్త!

 

- నిర్జర.