ప్రతి ఇద్దరు యువతలో ఒకరు


నేడు అంతర్జాతీయ యువ దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను, అన్ని స్థాయిల ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసిన కోవిద్ 19 వైరస్ కారణంగా ప్రపంచ యువ జనాభాలో సగం మంది నిరాశలో, మూడోంతుల మందిలో భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అనిశ్చిత ఉందని ఇంటర్నేషనల్ సర్వే వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ  'యూత్ అండ్ కోవిడ్ 19'  అంశంపై నిర్వహించిన సర్వేలో  ఫలితాలు వెల్లడించారు. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు వారిలో మహమ్మారి తక్షణ ప్రభావం తెలుసుకునేందుకు వీలుగా ఈ సర్వే నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇద్దరిలో ఒకరు నిరాశ, ఆందోళనకు లోనవుతున్నారని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ వెల్లడించారు. కోవిద్ 19 మహమ్మారి ప్రజల జీవితంలోని ప్రతి అంశాన్ని తాకింది. ఈ సంక్షోభం కన్నా ముందే యువతలో విద్యా, ఉపాధి, సామాజిక, ఆర్థిక సమస్యలు ఉండగా కొత్తగా వచ్చిన ఈ వైరస్ మరింత అనిశ్చిత పరిస్థితిని తీసుకువచ్చిందని ఆయన పేర్కోన్నారు. ఆరోగ్య సంక్షోభంతో పాటు వారి విద్యాఉపాధి అవకాశాలపై తీవ్రమైన ప్రభావం పడటంతో యువతలో మానసిక ఆందోళన పెరిగిందని స్పష్టం చేశారు. 112 దేశాల నుంచి 12వేల మందికి పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు.

కరోనా రాకముందు ఉద్యోగం చేస్తున్న ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు అంటే 17శాతం మంది యువత నిరుద్యోగులయ్యారు. ఉద్యోగాలు చేసే యువతలో పని గంటలు తగ్గాయి. ఐదుగురిలో ఇద్దరి ఆదాయం పడిపోయింది. అంటే 42శాతం యువత పని గంటలు తగ్గడంతో వారి ఆదాయం తగ్గిపోయింది. ఇక విద్య విషయానికి వస్తే ఆన్ లైన్ విద్యాబోధన అంటున్నప్పటికీ దాదాపు 65శాతం యువత తమ ఆసక్తిని కోల్పోతున్నారు. 51శాతం మంది తమ చదువులు ఆలస్యం అవుతుందన్నాయన్న నిరాశలో ఉన్నారు. 9శాతం మంది విద్యా సంవత్సరం నష్టపోతున్నామన్న మానసికఒత్తిడితో ఉన్నారు.

ఈ పరిస్థితిని ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్ లో యువతలో మానసిక సమస్యలు రాకుండా ఉండాలంటే వారిని నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములను చేయాలి. వారి ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశాలు ఇవ్వాలని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ అంటున్నారు. ఏది ఏమైనా కరోనా కోరల నుంచి భవిష్యత్ తరాన్ని కాపాడుకోవడానికి ప్రపంచమానవాళి సిద్ధం కావాలి.