ఈ ఆసనాలు వేయగలరా!

ఒక వ్యక్తి స్థిరంగా ఒకే భంగిమలో ఉంటే, దానిని ఆసనం అంటారు. ఒక ఆసనం వేసేటప్పుడు శరీరంలోని ఏ భాగమైతే నిశ్చలంగా ఉండిపోతుందో... ఆ అవయవానికి రక్తప్రసరణ మెరుగుపడుతుందనీ, తద్వారా ఆరోగ్యం చేకూరుతుందనీ చెబుతారు. ఈ ఆసనాలలో కొన్ని సులువుగా ఉంటే, మరికొన్ని మాత్రం అసాధ్యంగా తోస్తాయి. యోగాలో ఎంతో నిష్ణత, శరీరంలో పటుత్వం ఉంటేగానీ ఇవి సాధ్యం కావు. అలాంటి కొన్ని ఆసనాలు ఇవిగో... మన యోగా ఎంత లోతైనదో చెప్పుకొనేందుకే ఈ ఉదాహరణలు!

 

 

అష్టవక్రాసనం: పూర్వం అష్టావక్రుడనే ఓ రుషి ఉండేవాడు. తండ్రిలో తప్పుని ఎత్తి చూపిన కారణంగా ఆయన అష్టవంకర్లతో జన్మించమన్న శాపం దక్కుతుంది. అలా అష్టవంకర్లతో జన్మించినా కూడా గొప్ప జ్ఞానిగా ఆ రుషి చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అష్టవక్రాసనం ఆయన పేరు మీదుగానే వచ్చిందని అంటారు. రెండుకాళ్లనీ ముడివేసి, ఒక చేతిని వాటిలోంచి చొప్పించి... కేవలం అరచేతుల మీదుగా నేల మీద ఉండటం ఈ ఆసనంలో ప్రత్యేకత. ఈ ఆసనంతో వెన్నులో రక్తప్రసారం మెరుగుపడుతుంది.

 

శీర్ష పాదాసనం: శీర్షాసనం వేసి, పాదాలను తల మీదుగా వచ్చేలా ఉండే భంగిమే శీర్షపాదాసనం. ఇందులో మెడ, చేతులు, హృదయం, కాళ్లు, వెన్ను... అన్నింటి మీదా ఒత్తిడి పడుతుంది. ఈ ఆసనంతో మెదడు మీద కూడా గొప్ప ప్రభావం ఉంటుందట. ఏకాగ్రత పెరగటానికీ, వెన్ను బలపడటానికీ ఈ ఆసనాన్ని తప్పక సూచిస్తారు. ఈ ఆసనమే కష్టం అనుకుంటే ఇందులో పాదశీర్ష బకాసన, పాదశీర్ష ప్రపాదాసన వంటి ఆసనాలూ ఉన్నాయి. కాకపోతే వాటిజోలికి పోయేవారు తక్కువ.

 

 

గండభేరుండ ఆసనం: శీర్షాసనంలో కేవలం కాళ్లు తలవరకు రావడమే కష్టం. ఇక ఆ కాళ్లు మొఖానికి అటూ ఇటూ ఉండేలా నేల మీదకి ఆన్చడం ఇంకెంత కష్టమో కదా! అదే గండభేరుండ ఆసనం. ఈ ఆసనంతో శరీరం స్ప్రింగులాగా ఎటుతిరిగితే అటు తిరిగిపోయే దశకు చేరుకుంటుందని నమ్ముతారు. ప్రముఖ యోగా గురువులు B. K. S. Iyengar కూడా ఈ ఆసనం మహా కష్టమైన ఆసనాలలో ఒకటిగా పేర్కొన్నారు.

 

 

 

యోగనిద్రాసనం: చెట్టంత మనిషి చిన్న మూటలాగా చుట్టుకుపోయే ఈ ఆసనం ఫొటోలలో చూడాల్సిందే తప్ప ఎవరికి పడితే వారు వేయడం అసాధ్యం. చేతులు రెండింటినీ నడుము దగ్గర పెనవేసి, కాళ్లని తల కింద ముడివేసి కనిపించే ఈ ఆసనంతో శరీరం యావత్తూ శక్తిమంతమైపోతుందట! స్త్రీలలో రుతుపరమైన సమస్యలని నివారించడంలో ఈ ఆసనం దివ్యంగా పనిచేస్తుందట.

 

కాలభైరవాసనం: ఈ భంగిమ కాలబైరవుడైన శివుని తలపిస్తుంది కాబట్టి ఆ పేరు. పైన చెప్పుకొన్న ఆసనాలంత కష్టతరం కాకపోయినా... ఇప్పటి తరానికి ఇది అసాధ్యంగానే తోచవచ్చు. ఒక చేతిని, ఒక కాలిని నేల మీద ఆన్చి... ఒక కాలిని, ఒక చేతిని ఆకాశం దిశగా నిలపడమే ఈ ఆసనంలోని ప్రత్యేకత. ఈ ఆసనం వల్ల కాలికండరాలు బలిష్టంగా తయారవుతాయని యోగనిపుణులు హామీ ఇస్తున్నారు.

 

ఏదో కొన్ని ఆసనాల గురించి చెప్పుకొనే వీలు మాత్రమే ఉంది కాబట్టి ఐదు ఆసనాల గురించి మాత్రమే చెప్పుకొన్నాం. కానీ ఎన్నో రోజుల కఠోర శ్రమ, గురువుల పర్యవేక్షణ లేకుండా వేయడం అసాధ్యంగా తోచే ఆసనాలు చాలానే ఉన్నాయి. ఈ రోజుల్లో గర్వంగా చెప్పుకొనే ఏరోబక్స్కు ఏమాత్రం తీసిపోని భంగిమలు మన యోగాలో ఉన్నాయి. ఇంత లోతైన శాస్త్రం మన దగ్గర ఉండగా ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం పాశ్చత్య విధానాల వైపు పరుగుతీయడం ఎంత హాస్యాస్పదమో కదా!

- నిర్జర.