వర్మని మార్చాలనుకోవడం మన ఖర్మ

ఎపుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆఖరికి మహిళా దినోత్సవాన్ని కూడా వదలకుండా తనదైన శైలిలో ట్విట్టర్లో ట్వీట్స్ చేశాడు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా స్పందించిన వర్మ..


 
‘‘ఏడాదిలో అన్నీ రోజులు పురుషులవేనని.. ఈ ఒక్కరోజు మహిళకు ఇచ్చారు. ఉమెన్స్‌ డే’ని ‘మెన్స్‌ డే’ అనాలి. మహిళలను పురుషులు సంతోష పెట్టినంతగా.. పురుషులను మహిళలు సంతోషపెట్టలేరు. కనీసం పురుషుల దినోత్సవం రోజైనా మహిళలు వారిపై అరుపులు, కేకలు వేయకూడదు. వారికి కొంచెం స్వేచ్ఛనివ్వాలి. పురుషుల అందరి తరఫు నుంచి నేను మహిళలకు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆ రోజు పురుషులు మహిళలకు ఏం చేయాలో నాకు తెలియదు.. కానీ ఏడాదిలో ఒక రోజు మాత్రం పురుషులు మహిళల దినోత్సవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.’’అని అన్నారు. 

 

 

అక్కడితో ఆగకుండా.. "ప్రపంచంలోని ఆడవాళ్లంతా, మగవారికి సన్నీలియాన్ ఇచ్చినటువంటి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు. పురుషులందరి తరఫునా మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నానని, ఏదో ఒకరోజు పురుషులకూ స్వాతంత్ర్యం లభిస్తుందని, 'మెన్స్ డే' జరుపుకునే రోజు వస్తుందని అన్నాడు.

 

 

కుటుంబం, ప్రేమలు, ఆప్యాయతలు, భక్తి, తదితర అంశాలకి దూరంగా ఉండే వర్మ, దేశంలో జరిగే ప్రతి సంఘటనకి తనదైన శైలిలో రియాక్ట్ అవుతారు. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ఉంది. కానీ, అది ఇంకొకరికి ఇబ్బంది పెట్టనంతవరకు మాత్రమే అనే విషయం వర్మ తెలుసుకోవాలి. ఒకప్పుడు మహిళలకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు తీసిన వర్మ, ఇంతలా దిగజారి మహిళలపై వ్యాఖ్యలు చేయడం అయన స్థాయిని తగ్గిస్తుంది.

 

 

ట్విట్టర్ లో సన్నీ లియోన్ పైన చేసిన వ్యాఖ్యానాలకి కొందరు వ్యతిరేకంగా మాట్లాడితే, వర్మ మాత్రం తాను చేసింది అక్షరాల కరెక్ట్ అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. వాస్తవానికి సన్నీలియోన్ అంత నిజాయితీ, స్వీయ గౌరవం ఉన్న ఆడవాళ్లు ఉండరని చెప్పుకొచ్చారు.

 

 

అయినా, వర్మ ఇంతేలే అని ఊరుకోవడం తప్ప మనం మాత్రం చేసేదేముంది. సెంటిమెంట్స్ ఉన్నవాడిని మార్చే ప్రయత్నం చేయొచ్చు. కానీ, వర్మ లాంటి విపరీత భావాలున్న వ్యక్తికి ఎంత చెప్పినా దండగే. అసలు ఈయనకి తన తల్లి, భార్య, కూతురు ఆడవాళ్లే అనే విషయం గుర్తుందంటారా!