తాండూరు తంట... సబితాకు పదవి ఇవ్వడంతో పట్నం మహేందర్ అసంతృప్తి

అందిన పండు తీయన.. అందని పండు పుల్లన అన్న సామెతకు అద్దం పడుతోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయం. స్థానికంగా ఇద్దరు ముఖ్య నేతల మధ్య వర్గపోరు రోజురోజుకు తీవ్రం అవుతుంది. గతంలో ఆ జిల్లాలో మంత్రిగా ఉండి ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించిన పట్నం మహేందర్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఆయన చెప్పిందే వేదం అనే విధంగా ఉండేది. తెలంగాణ వచ్చిన కొత్తలో ఆయనకు మంత్రి పదవి రావడం.. ఆ జిల్లాలో ఇతర నేతలు పోటీ లేకపోవడంతో ఆయన హవాకు ఎదురులేకుండా పోయింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో ఉండడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రా రెడ్డి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకొని ఏకంగా మంత్రి పదవి చేపట్టటంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయ సమీకరణమే మారిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో  తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. అయితే  మరోసారి తనకు మంత్రి పదవి వస్తుందన్న మహేందరెడ్డి ఆశ నెరవేరలేదు. అదే జిల్లాకు చెందిన తన దగ్గరి బంధువైన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి మంత్రిగా అవకాశం ఇచ్చారు సీఎం  కేసీఆర్. దీంతో మంత్రి కావాలన్న పట్నం మహేందర్ రెడ్డి ఆశలకు గండి పడింది. సందట్లో సడేమియా అన్నట్టుగా అప్పట్నుండి ఈ రెండు శిబిరాల మధ్య వర్గపోరు కూడా షురూ అయ్యింది. ఇన్నాళ్లు జిల్లాలో తనకు తిరుగులేదని భావించిన మహేందర్ రెడ్డి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ అందలం వేయడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాండూరులో తనపై గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ మహేందర్ రెడ్డి వర్గం గుర్రుగా ఉంది. ఇటీవల రెండు సార్లు వికారాబాద్ జిల్లా పర్యటనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు.

ఆ కార్యక్రమాలకు అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు కూడా ఈ అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేదు. పట్నం మహేందర్ రెడ్డి సూచనల మేరకే సబితా ఇంద్రా రెడ్డి కార్యక్రమాలకు ఆయన వర్గీయులు వెళ్లలేదన్న వాదన జిల్లాలో గట్టిగానే వినిపిస్తుంది. సబితా ఇంద్రా రెడ్డి మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు మర్యాద పూర్వకంగా కూడా ఆమెను మహేంద్రరెడ్డిని కలవలేదు. దీన్ని బట్టి ఇరువురు నేతల మధ్య రాజకీయ అగాధం బాగా పెరిగిందనే చర్చ పార్టీలో సాగుతోంది. జిల్లాలో రానురాను ఈ వర్గపోరు మరింత ముదురుతోందని ఆందోళనను టీఆర్ఎస్ క్యాడర్ వ్యక్తం చేస్తుంది. ఒక వైపు మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇద్దరు కీలక నేతల మధ్య వివాదం కొనసాగితే పార్టీకి నష్టం కలుగుతుందని కింది స్థాయి నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరువురు నేతల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేయడానికి టీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. వారు కలుస్తారా లేక కయ్యానికి సై అంటారా అనే సంగతి వేచి చూడాలి.