కేసీఆర్ కు తలనొప్పి...  నియోజకవర్గానికి రెండు వర్గాలుగా విడిపోయిన గులాబీ తమ్ముళ్లు

 

టీఆర్ఎస్ లోకి ఈ మధ్య చాలా మంది నేతలు జంపయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిన చోట కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీ లోకి వచ్చిన నేతలు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నించడంతో అసలు సమస్య మొదలైంది. అసలే పదవులు లేక పరేషాన్ అవుతున్న పాత నేతలని పట్టించుకోక పోవడంతో నియోజక వర్గాల్లో గొడవలు జరుగుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో.. కమిటీల్లో.. పాత ఎమ్మెల్యేలను లెక్కలలోకి తీసుకోకపోవడంతో వర్గపోరు జరిగినట్లు తెలుస్తుంది.

తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ మధ్య జూపల్లి వర్గాన్ని చీల్చి తన బలాన్ని పెంచుకోవాలని హర్షవర్దన్ ప్రయత్నం చేసినట్లు చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో జూపల్లి - హర్షల మధ్య చిచ్చు రాజుకున్నట్లు క్యాడర్ చర్చించుకుంటోంది. హర్షవర్ధన్ రెడ్డి , మంత్రి నిరంజన్ రెడ్డి వర్గంలో చేరటం జూపల్లి వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు కొల్లాపూర్ కోట వివాదం విషయంలో మాజీ మంత్రి బహిరంగ సభలు పెట్టి మరీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ కోట కథ వెనకాల ఎమ్మెల్యే వర్గీయుల ప్రమేయం ఉంది అన్నది జూపల్లి బ్యాచ్ వాదన. ఇక పాలేరు నియోజకవర్గం లోనూ ఇదే పరిస్థితి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ యాక్టివ్ గా తిరుగుతున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఉపేంద్ర వైపు వెళ్లకుండా తుమ్మల ఈ స్కెచ్ వేసినట్లు పార్టీలో ప్రచారం అవుతోంది. తుమ్మలపై ఉపేందర్ పార్టీ అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఉపేందర్ రెడ్డి వర్గీయులు అవసరమైతే పార్టీ మారాలని వత్తిళ్ళు కూడా తెస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.