వైసీపీలోకి మాజీ మంత్రి.. అప్పుడే పార్టీలో మొదలైన లొల్లి

 

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం ఆమె వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28వ తేదీన అమరావతిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ఆమె ప్రకటించారు.  అయితే ఆమె అలా జగన్ తో భేటీ అయ్యారో లేదో.. ఇలా వైసీపీలో ముసలం మొదలయ్యింది. కిల్లి కృపారాణి చేరిక ఖాయమైన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అసంతృప్తి భగ్గుమంది. కిల్లి కృపారాణి వైసీపీలో చేరడాన్ని ధర్మాన ప్రసాదరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రశాంతంగా ఉన్న జిల్లా వైసీపీలో కృపారాణి రాకతో వర్గ విభేదాలు తలెత్తాయి. అయితే ధర్మాన వర్గం అసంతృప్తిపై కిల్లి కృపారాణి స్పందించారు. ధర్మాన.. తన చేరికపై వ్యతిరేకంగా ఉన్నారా లేరా అనేది తనకు అనవసరం అని, ఆయన మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ కోసం జిల్లాలో శక్తిమేర కృషి చేస్తానని కిల్లి కృపారాణి స్పష్టం చేశారు.