ఎల్లారెడ్డిలో చీలిన గులాబీ.. కాంగ్రెస్ నుండి వలస వచ్చిన నేతలతో మొదలైన ముసలం!

 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన నాయకులు.. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన రవీందర్ రెడ్డి పక్కా టీఆర్ఎస్ కాండిడేట్ అని చెప్పుకోవచ్చు. 2004 లో రాజకీయ అరంగేట్రం చేసిన రవీంద్రరెడ్డి ఇంతవరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్థానానికి ఆరుసార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలిచారు, రెండుసార్ల ఓడిపోయారు. 2008 ఉప ఎన్నికల్లో ఓసారి, 2018 ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు. మిగతా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఇతర పదవులు పదోన్నతులు మాత్రం పొందలేకపోయారు. పార్టీ అధిష్టానంలో ఆయన పట్టు సాధించలేకపోవడం ఒక కారణమైతే జనంలో వ్యతిరేకత పెరగడం మరో కారణంగా మారింది. దీంతో గత ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పరిస్థితి ఆశాజనకంగా లేదని నిఘా వర్గాలు ముందుగానే సంకేతాలిచ్చాయి. అభ్యర్థిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎల్లారెడ్డి స్థానం గెలిచే అవకాశం లేదని గులాబీ బాస్ కు ముందస్తుగా వర్తమానం కూడా అందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఎల్లారెడ్డిలో మాత్రం పరాజయం పాలైంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన నల్లమడుగు సురేందర్ చేతిలో సుమారు 34 వేల ఓట్ల తేడాతో రవీందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు. 

రాష్ట్రమంతటా అనుకూల పవనాలు వీచినప్పటికీ ఎల్లారెడ్డిలో మాత్రం ఎదురుగాలి తగలడంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇది కేవలం రవీందర్ రెడ్డి స్వయంకృతాపరాధమేనని తేల్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. తన మనుగడ కోసమో తెలీదు కానీ నల్లమడుగు సురేందర్ గులాబీ గూటిలో చేరడంతో ఎల్లారెడ్డి రాజకీయం రంజుగా మారింది. స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో టిఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ రెడ్డి తన ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్లుగా తన వెంట ఉంటున్న అనుచరుల కోసం గట్టిగా పని చేయాలని ఆయన భావించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ వర్గాన్ని ఢీకొనేందుకు సొంతంగా ప్రతి మండలంలో తన అనుచరులను రంగంలోకి దింపారు. ఈ ఇరువర్గ పోరు కారణంగా నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఎల్లారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాగిరెడ్డిపేట ఎంపిపి కుర్చినీ స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మిగతావన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడినప్పటికీ వారంతా ఎమ్మెల్యే సురేందర్ వర్గీయులు కావడం విశేషం. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి తన పంథా మార్చారు. మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని భవిష్యత్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. వారి అనుచరుడిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. 

ప్రధానంగా తాను హరీశ్ రావు వర్గియుడనని చాటుకునే ప్రయత్నాలను ఏనుగు రవీందర్ రెడ్డి ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని తన వర్గీయులను హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. ఇటీవల వరుసగా 3 రోజుల పాటు తన వారిని తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కల్పించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, గాంధారి మండలాలకు చెందిన నాయకులను పరిచయం చేసి ఇదంతా తన వర్గమని చూపించారు. హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇలా దూకుడు పెంచారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో తన వర్గీయులతో ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక శిబిరం నడుపుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే పార్టీ సమావేశాలు చర్చలు రవీందర్ రెడ్డి శిబిరంలోనే జరుగుతున్నాయి. అధికారికంగా ఎమ్మెల్యే సురేంద్ర నడుపుతున్న ఆఫీస్లో ఈయన వర్గీయులెవరూ కనిపించడం లేదు. రవీందర్ రెడ్డి వర్గీయులు ఇంత వరకు ఎమ్మెల్యే ఆఫీసు గడప కూడా తొక్కలేదు,అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, ఎమ్మెల్యే నిర్వహించే పార్టీ సమావేశాలు సభలకు హాజరవడం లేదు, రవీందర్ రెడ్డి వచ్చినపుడు మాత్రమే వారు ఎల్లారెడ్డిలో దర్శనమిస్తున్నారు, అది కూడా రవీందర్ రెడ్డి వెంట ఆయన ఉన్నంత సేపు హడావుడి చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇరువర్గాల పోరు నానాటికీ ముదురుతున్నట్టు కనిపిస్తోంది. 

ఇక త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరు ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళనకు చెందుతున్నారు. కౌన్సిలర్ ల టికెట్ లు మొదలు వారిని గెలిపించుకునే వరకు ఇటు నల్లమడుగు సురేందర్, అటు ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించే సూచనలున్నాయి. ఇప్పటికే రవీందర్ రెడ్డి తన అనుచరుల్ని మున్సిపల్ చైర్మన్ చేయాలని భావిస్తున్నారు, ఆ అభ్యర్థి పేరు కూడా ఖరారు చేశారు. దీనిపై హరీశ్ రావు ద్వారా అంతర్గత ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సురేంద్ర మాత్రం కేటీఆర్ ద్వారా తన పరువు ప్రతిష్ట కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. మొదటి నుంచి హరీశ్ రావు అనుచరుడిగా ఉన్న రవీంద్రరెడ్డిపై సహజంగానే కేటీఆర్ కు సానుభూతి లేదు. దీనికి తోడు ఆయన ఇటీవల హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వెంట తిరగడంతో కేటీఆర్ దృష్టిలో బలంగా నాటుకుపోయారు. ఈ వర్గపోరు కారణంగా ఏనుగు రవీందర్ రెడ్డిని మరింత దూరం చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్ పావులు కదుపుతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అయోమయంలో స్థానిక గులాబీ దళం ఉండగా అన్నీ కలిసొస్తే హరీశ్ రావు నీడను మళ్లీ అందలం ఎక్కుతాననే ఆశ విశ్వాసం మాత్రం ఏనుగు రవీందర్ రెడ్డికి ఉంది. మరి ఎవరి ఆశలు నెరవేరుతాయో ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.