ఓరుగల్లు జిల్లాలో చక్రం తిప్పబోయేది ఎవరు...

 

పూర్వం బలమున్నవాడిదే రాజ్యం అన్న మాట మనం విన్నం కానీ ఇప్పుడు రాచరికాలు పోయినా మాటల్లోని విషయాన్ని మాత్రం మనం కళ్లారా చూస్తున్నం. దీనికి ఉదాహరణ ఉమ్మడి ఓరుగల్లు జిల్లాని తీసుకుంటే ఇక్కడ అధికార పార్టీలో నేతల బలపరీక్షలు పెరుగుతున్నాయి. స్థానికంగా గ్రూప్ రాజకీయాలు కొత్త కానప్పటికీ తాజగా ఏర్పడిన వర్గపోరు మోతాదు మించిందని చెప్పాలి. కొందరు నాయకులు రెండు గ్రూపులుగా విడిపోతే మరికొందరు ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా ఏకంగా రాష్ట్ర నాయకత్వంతోనే చేరువులో కి వెళ్లారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలే ఇప్పుడు టీఆర్ఎస్ లోనూ చక్రం తిప్పుతున్నారు. ఇద్దరూ రాజకీయాల్లో తలపండిన నేతలే కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. పైకి ఇద్దరు కలిసున్నట్టే అనిపించినా అంతర్గతంగా మాత్రం ఎవరి వర్గం వారిదే గతంలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కూడా వీరి మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగేవి ఒక దశలో ఇద్దరు నేతలు నేరుగా ఎదురుపడి తిట్టుకున్న సందర్భాలున్నాయి. అయితే అదంతా గతం ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ లో ఉన్నారు. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. గత మంత్రి వర్గ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినప్పట్నుంచి వీరిద్దరూ ఒక్కటయ్యారని అంత అనుకున్నారు. కానీ గతంలో వారి మధ్య ఉన్న విబేధాలు అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నాయి. పైకి కనిపించినంతగా వారి మధ్య సఖ్యత లేదని టీఆర్ఎస్ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. 

మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న కీలక నేతలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు కడియం శ్రీహరి వర్గమైతే, మరికొందరు ఎర్రబెల్లి వర్గం కొనసాగుతున్నారు. ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న కొంత మంది నేతలు నేరుగా అధినాయకత్వంతోనే వారు చేరువులో ఉంటున్నారు. అభివృద్ధి పనుల విషయంలో గానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని ఒక నేత పాల్గొంటే ఆయనకు అనుకూలంగా ఉండే ఇతర నేతలే వాటిని ముందుండి నడుపుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ముప్పై రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమంలోనూ ఈ గ్రూపు రాజకీయం స్పష్టంగా కనిపించింది. మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత ఈ గ్రూపు విభేధాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన నేతలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి, మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీరంతా మంత్రి పదవి ఆశించిన వారే.

సామాజిక సమీకరణాల నేపథ్యంలో కడియం శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆ లిస్ట్ లో నుంచి కడియం శ్రీహరి పేరు మాయమైంది. అయితే కడియంకు మంత్రి పదవి రాక పోవడానికి ఎర్రబెల్లి దయాకర్ రావునే కారణమని కడియం అనుచరులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఊహించుకున్న దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవితో సరిపెట్టారు. అయితే ఆశించిన వారికి మంత్రి పదవులు దక్కక పోవడంతో ఒకరి పై ఒకరు అనుచరులు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు కీలక పదవులు కట్టబెట్టిన కేసీఆర్ ఈ సారి మాత్రం కాస్త మొండి చేయి చూపారని చెప్పాలి. గత మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా మొదటి రాజయ్యను తీసుకున్నారు. తర్వాత ఆయన తప్పించి ఆ పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు. ములుగు ఎమ్మెల్యేగా ఉన్నందుకు చందూలాల్ కు మంత్రి పదవి ఇచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదనాచారికి స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి ఓరుగల్లుకే రెండు మంత్రి పదవులు చీఫ్ విప్ పదవి మాత్రమే ఇచ్చారు. మొన్నటి వరకు ఒకే ఒక మంత్రి గా ఎర్రబెల్లి దయాకరావు కొనసాగారు, ఇప్పుడు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు.దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవి ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనకంటే ముందే టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన సత్యవతి రాథోడ్ కు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై రెడ్యా నాయక్ కొంత అలక వహించినట్లు సమాచారం. మంత్రి పదవులు ఆశించిన వారికి అవి దక్కలేదు. అందువల్ల నామినేటెడ్ పోస్టులపై ఇప్పుడు వారి కన్ను పడింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సీఎంకు దగ్గరగా ఉండే వ్యక్తులతో పైరవీలు చేయించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టచ్ లో ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో కొందరు కడియం శ్రీహరిని, మరికొందరు ఎర్రబెల్లి దయాకర్ రావుని నమ్ముకొని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన దగ్గరకు ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇక ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఒరుగల్లుల్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారో చూడాలి.