అవే దందాలు..అవే లొల్లిలు. అలంపూర్-గద్వాల్ తెరాస ఎమ్మెల్యేల మధ్య గొడవలు!

 

అలంపూర్, గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేల పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది ఎక్కడిదాకా వెళ్ళిందంటే అలంపూర్ లో మంత్రి కార్యక్రమం ఉంటే గద్వాల్ ఎమ్మెల్యే ఎటాక్ చేస్తారని పోలీస్ బలగాలు మోహరించే వరకూ వెళ్ళింది. స్వయాన గద్వాల జిల్లా పోలీస్ ఉన్నతాధికారులే ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. దీంతో మంత్రి పర్యటన రోజున గద్వాల ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్లారు. ఈ ఉదాహరణ చాలు గద్వాల రాజకీయం హాట్ హాట్ గా ఎలా సాగుతుందో చెప్పటానికి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఇసుక దందా చేస్తున్నారని.. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఆరోపణలు చేశారు. ప్రెస్ మీట్ లతో మీడియా ముందుకొచ్చారు. కేవలం ఇసుక దందాలే కాకుండా అలంపూర్ లో విపక్షాలతో చేతులు కలిపిన కృష్ణమోహనరెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని అబ్రహం ఆరోపించారు. అబ్రహం ఆరోపణలపై గద్వాల ఎమ్మెల్యే కూడా ఇక్కడ రియాక్ట్ కాలేదు. కానీ అబ్రహాంపై రివేంజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అబ్రహంతో జిల్లా మంత్రి ఇదంతా చేయిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయుల అనుమానం. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో క్లోజ్ రిలేషన్స్ ఉండటం నచ్చని మంత్రి నిరంజన్ రెడ్డి ఇలా చేయిస్తున్నారని గద్వాల్ ఎమ్మెల్యే వర్గీయుల ఆరోపణ. గద్వాల జిల్లా ఎపిసోడ్ పై మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. మంత్రిగా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రాజీ కూడా ప్రయత్నం చేయకపోవడంతో గద్వాల్ జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. మరి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మంత్రికీ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ వారికి గులాబీ అధిష్ఠానం ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.