ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అవుతున్న మంత్రులు...

 

వాళ్లు రాష్ట్రానికి మంత్రులు కానీ సొంత నియోజకవర్గం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే జంకుతున్నారు, కొద్దిమంది మంత్రులైతే ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రులు, రాష్ట్రానికి మంత్రులైనా వాళ్ల నియోజకవర్గాలు దాటి బయట కాలు పెట్టలేకపోతున్నారు. పక్క నియోజక వర్గాల్లో కూడా మంత్రులు తమ ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రుల రాకను వ్యతిరేకిస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆధిపత్య పోరుతోనే మంత్రులు, ఎమ్మెల్యేల గ్యాప్ కు కారణంగా తెలుస్తోంది.

నియోజక వర్గాల్లో మంత్రుల జోక్యాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తమ నియోజక వర్గాలకు మంత్రులు రావటాన్ని ఇష్టపడని కొంత మంది శంకుస్థాపనను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు అనే చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలతో మంత్రికి పొసగడం లేదని సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వాళ్లు మంత్రి వస్తే ఎలాంటి హడావుడి చేయొద్దని కార్యకర్తలు అనుచరులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

ఇక వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సొంత నియోజక వర్గాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఇక హైదరాబాద్ లో హల్ చల్ చేసే మంత్రి తలసానికి ఇప్పటికే ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తనయుడు ఓటమికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణమని చర్చ అప్పట్లో జరిగింది.

ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులున్నారు. వారు కూడా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అటు ఆదిలాబాద్ లోనూ ఇదే పరిస్థితి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత చెడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో మంత్రులు నియోజకవర్గాలకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అటు వైపు కూడా చూడడం లేదని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిపై మంత్రులు ఎమ్మెల్యేలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితులపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.