అవసరం లేకపోయినా ICU

 

ఒకప్పుడు ICU అన్న పేరు పెద్దగా వినిపించేది కాదు. కానీ ఆసుపత్రులు పెరిగిపోవడం, వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన ఒక స్థాయిని దాటిపోవడంతో... ఇప్పుడు ప్రతివారూ ICU గురించే మాట్లాడుతున్నారు. రోగి పరిస్థితి కాస్తంత విషమంగా కనిపించగానే ICUనే శరణ్యం అనుకుంటున్నారు. కానీ ఇదేమంత మంచి పద్ధతి కాదని సూచిస్తున్నారు కొందరు పరిశోధకులు.

 

ఒక రోగి పరిస్థితి చేయి దాటిపోతుంది అనుకున్నప్పుడు అతనికి కృత్రిమ శ్వాసని అందించే వెంటిలేటర్లు, రక్తపోటుని పరీక్షించే మానిటర్లు, గుండె ఆగిపోకుండా చూసే ఎక్స్‌టర్నల్ పేస్‌మేకర్ల వంటి పరికరాలన్నీ అందుబాటులో ఉండే ICUలో అతడిని ఉంచుతారు. ఇన్ని అధునాతన పరికరాలకు తోడుగా నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కూడా ఉండాలి కాబట్టి ICU ఖర్చులు భారీగానే ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, ఆసుపత్రిని బట్టి ఐదువేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకూ ఈ ఖర్చులుంటాయి.

 

అయితే నిజంగా ICUలో చేరేవారందరినీ, అవసరం మేరకే అందులో చేరుస్తున్నారా అనే ఆలోచన వచ్చింది అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులకు. దాంతో వారు 2015-16 సంవత్సరాల మధ్య ICUలో చేరిన 808 మంది రోగుల రికార్డులను పరిశీలించారు. ఈ పరిశీలన తరువాత తేలిన అంశాలు ఏమిటంటే...

 

- వీరిలో 23.4 శాతం రోగులని నిరంతరం పరిశీలించే అవసరం ఉంది కానీ, మరీ ICUలో ఉంచి గమనించుకోవాల్సినంత తీవ్రత లేదు.

 

- 20.9 శాతం మంది మొండి రోగాలతో బాధపడుతూ ఉండటం వల్ల, వారిని ఎంతకాలం ICUలో ఉంచినా కూడా ఉపయోగం లేదు. వారిని ICUలో ఉంచినా, విడిగా ఉంచినా ఒకటే!

 

- 8 శాతం మంది రోగులు తమ జీవితపు ఆఖరి క్షణాలలో ఉన్నారని తేలింది. వీరిని కూడా ICUలో ఉంచడం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనమూ లేదు.

 

మొత్తం మీద ఇలా దాదాపు 50 శాతం మందిని అవసరం లేకపోయినా కూడా ICUలలో ఉంచుతున్నారని తేల్చారు పరిశోధకులు. దీని వలన రోగుల తాలూకు విలువైన డబ్బులు వృధా అవుతున్నాయనీ, ఆసుపత్రి తాలూకు విలువైన పరికరాలనీ అవసరం లేని చోట వినియోగించాల్సి వస్తోందనీ వాపోయారు. ఒకవేళ రోగులను ICUలలో ఉంచాల్సి వచ్చినా కూడా 65 శాతం రోజులు అదనంగా ఉంటున్నారని లెక్కకట్టారు.

 

ఇంతకీ పరిశోధకులు తేల్చిందేమిటంటే... ICU (ఇంటెన్సివ్‌ కేర్‌) అనే స్థితి రోగికి ఉపయోగమా లేదా అన్నది వైద్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ICU వెలుపలే చిన్నాచితకా మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని రోగిని గమనించుకునే సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే రోగిని ICUలో ఉంచాలి. లేకపోతే అటు రోగికీ ఇటు ఆసుపత్రికీ కూడా ICUలు భారంగా మారిపోయే ప్రమాదం ఉంది. మరి వాణిజ్య విలువల ఆధారంగా నడుస్తున్న కొన్ని ఆసుపత్రులు ఈ జాగ్రత్తను ఎంతమేరకు పాటిస్తాయి అంటే జవాబు చెప్పడం కష్టమే!                                      

 

 - నిర్జర.