ఆడవాళ్లకి నిజంగా ఏం కావాలి?

 

అనగనగా ఆర్ధర్ అని ఒక రాజు ఉండేవాడు. యువకుడు, అందగాడు, తెలివైనవాడు అయిన ఆ రాజంటే, రాజ్యంలో అందరికీ ఇష్టమే. అలాంటి ఆర్ధర్కి అనుకోని కష్టం ఎదురైంది. ఆర్థర్కంటే గొప్ప చక్రవర్తి ఒకరు, ఆర్థర్ రాజ్యం మీద దాడిచేశాడు. అతని మహాసైన్యం ముందు ఆర్థర్ పరాక్రమం ఏమాత్రం నిలవలేదు. ఆ చక్రవర్తి సైనికులు ఆర్థర్ని బంధించి తమ చక్రవర్తి ఎదుట ప్రవేశపెట్టారు.

 

ఆర్థర్ని ఓడించిన చక్రవర్తి కూడా సామాన్యుడు కాడు. సైనికబలంతో పాటుగా అపారమైన మేథస్సు అతని సొంతం. తన ముందు సంకెళ్లతో నిలబడి ఉన్న ఆర్థర్ ప్రతిభ అతనికి తెలియంది కాదు. ‘‘నీ సామర్థ్యం తెలిసినవాడిని కనుక నీకు మరణశిక్ష విధించాలనుకోవడం లేదు. అయితే ఇందుకు ఒక షరతు. నన్ను ఎప్పటి నుంచో ఒక ప్రశ్న వేధిస్తోంది. నువ్వు కనుక ఆ ప్రశ్నకి బదులు చెప్పగలిగితే నీ రాజ్యాన్ని నీకు తిరిగి అప్పగించేస్తాను. మరోసారి ఈ రాజ్యం వంక కన్నెత్తి కూడా చూడను. కానీ ఒక్క ఏడాదిలో కనుక నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే, నీకు మరణదండను తప్పదు.’’ అని ఆర్థర్కి ఒక షరతు పెట్టాడు ఆ చక్రవర్తి.

 

చక్రవర్తి మాటలు విన్న ఆర్థర్కు చెప్పలేనంత సంతోషం కలిగింది. ‘‘ఇంతకీ మీ ప్రశ్న ఏమిటో చెప్పారు కాదు?’’ అని ఉత్సాహంగా అడిగాడు.

 

‘‘ఆడవాళ్లు నిజంగా కోరుకునేది ఏమిటి? అన్నదే నన్ను వేధిస్తున్న ప్రశ్న. దీనికి ఎలాంటి సందేహానికీ తావు లేనటువంటి సమాధానం నాకు కావాలి.’’ అని సెలవిచ్చాడు చక్రవర్తి.

 

‘ఓస్ ఇంతే కదా! దీనికి ఏడాది సమయం ఎందుకు. ఒక్క రోజులో సమాధానం చెప్పేయగలను,’ అనుకున్నాడు ఆర్థర్. కానీ తన అంతఃపురానికి వెళ్లి ఎంతగా ఆలోచించినా తగిన సమాధానం తట్టనేలేదు. డబ్బు, హోదా, బంగారం, సంతానం, భవంతులు, ఆరోగ్యం.... ఇలా ఏ ఒక్కదాన్ని ఎంచుకున్నా మిగతావి లోటుగా కనిపిస్తున్నాయి. తనకు దక్కిన ప్రశ్నకు జవాబు కోసం ఆర్థర్ రాజ్యంలో తనకి తెలిసిన ప్రతి ఒక్కరినీ కదిపి చూశాడు. తన మంత్రులను, సామంతులను, స్నేహితులను, పండితులను అందరినీ అడిగి చూశాడు. ప్చ్! ఎవ్వరి దగ్గరా అతనికి తృప్తి కలిగించే జవాబు దక్కనే లేదు. ఇంతలో ‘ఈ రాజధాని శివార్లలో ఒక మంత్రగత్తె ఉంది. ఆమె దగ్గర ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం లభిస్తుందని చెబుతారు. కానీ మన సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆమె కోరినంత మూల్యం చెల్లించి తీరాలి,’ అని విన్నాడు ఆర్థర్.

 

ఆ మంత్రగత్తెను కలవడం ఆర్థర్కు ఇష్టం లేదు. కానీ ఏం చేసేది! అతనికి విధించిన గడువు మరొక్క రోజులో ముగిసిపోనుంది. దాంతో ఇక చివరి అస్త్రంగా మంత్రగత్తె దగ్గరకి వెళ్లక తప్పలేదు. ఆర్థర్ సందేహాన్ని విన్న మంత్రగత్తె తనకి జవాబు తెలిసినట్లుగా ఓ చిరునవ్వు నవ్వింది. ‘‘నీ ప్రశ్నకి నేను జవాబు చెబుతాను. మరి నాకు కావల్సినది నువ్వు ఇస్తావా!’’ అని అడిగింది. ఆర్థర్కి సరే అనక తప్పలేదు.

 

‘‘ఆడది తన జీవితం మీద తనకే అధికారం ఉండాలని అనుకుంటుంది. ఆ గౌరవం ఆమెకి దక్కని రోజున, నువ్వు ఆమెకి ఏమిచ్చినా దండగే! తన వ్యక్తిత్వానికి విలువ లేని చోట ఆమెకి ఏమిచ్చినా... తన మనసులో లోటుని పూడ్చలేవు.,’’ అని చెప్పింది మంత్రగత్తె.

 

మంత్రగత్తె చెప్పిన జవాబు ఆర్థర్కి చాలాబాగా నచ్చింది. ‘‘నీ జవాబు చాలా బాగుంది. ఇది తప్పకుండా ఆ చక్రవర్తిని తృప్తి పరుస్తుంది. మరి ఇందుకు బదులుగా నీకేం కావాలి?’’ అని అడిగాడు ఆర్థర్.

 

‘‘మరేం లేదు! నీ జీవితంలో ఎందరో స్త్రీలు ఉంటారు. తల్లి, భార్య, చెల్లి, కూతురు.... ఇలా ఎందరో ఆడవారితో నీ జీవితాన్ని పంచుకుంటావు. నేను ఇందాక చెప్పిన జవాబుని వారికి అన్వయించు చాలు. వారికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందని, తనదైన మనసు ఉంటుందని గుర్తించి గౌరవించు. హద్దులు దాటి వారి జీవితాలను కూడా నువ్వే శాసించాలని ప్రయత్నించవద్దు. ఇదే నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం,’’ అని చెప్పింది.

(ప్రచారంలో ఉన్న జానపద కథ ఆధారంగా)

- నిర్జర.