అందుకనే మనిషి గొప్పవాడు

 

అది ఓ దట్టమైన అడవి. ఆ అడవిలో ఉన్న జీవాలన్నీ ఓ మిట్టమధ్యాహ్నం కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాయి. అకస్మాత్తుగా ‘అసలు జీవితం అంటే ఏమిటి?’ అన్న చర్చ మొదలైంది.

 

‘జీవితం అంటే తనివితీరా పాడటం. అలా ఆటలా పాటలా సాగేదే అసలైన జీవితం,’ అని మైమరపుతో చెప్పింది ఓ కోయిల. చెప్పడమే కాదు, వెంటనే ఓ కూనిరాగం తీయడం మొదలుపెట్టింది.

 

‘పాటా పాడా! జీవితం అంటే భయం భయంగా బతకడం. ఎవరి కంటా పడకుండా భయపడతూ నక్కి నక్కి తిరగడం,’ అని చెప్పిందో పందికొక్కు.

 

‘అబ్బే అంత భయపడటం ఎందుకు? జీవితం అంటే అందం, జీవితం అంటే సంతోషం,’ అంటూ రెక్కలు చాస్తూ గిరగిరా తిరుగుతూ చెప్పింది ఓ అందమైన సీతాకోకచిలుక.

 

‘నిరంతరం అలా తిరుగుతూ ఉంటే ఇక పనిచేసేదెప్పుడు. అసలు జీవితం అంటేనే పని. పని చేయకపోతే జీవితానికి అర్థమే లేదు,’ అని నిట్టూర్చింది ఓ తేనెటీగ.

 

‘నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజం. సంతోషం సంగతి పక్కన పెట్టండి. నిరంతరం పనిచేయకపోతే జీవించి ఉపయోగం లేదు,’ అని తేనెటీగ మాటలను బలపరిచింది చీమ.

 

ఇంతలో ‘మీతో నేను ఏకీభవించను,’ అంటూ గంభీరంగా ఓ స్వరం వినిపించింది. ఆ స్వరం ఎక్కడిదా అని పైకి చూసిన జీవులన్నింటికీ ఓ గద్ద కనిపించింది. ‘జీవితం అంటే స్వేచ్ఛ. అల్లంత ఎత్తున ఆకాశంలో తిరుగుతూ కిందకి చూస్తుంటే ఆ మజానే వేరబ్బా!’ అంటూ నిశ్చలంగా ఆకాశంలో తేలుతూ చెప్పింది.

 

నిదానంగా ఈ చర్చలోకి మొక్కలు కూడా తలో మాటా కలిపాయి. ఎత్తైన దేవదారు వృక్షం గద్దతో ఏకీభవించింది. అడవిపూలేమో చీమని బలపరిచాయి. గులాబీ మాత్రం అందమే ముఖ్యమన్న సీతాకోకచిలుక మాటలను బలపరిచింది. ఈ హడావుడంతా చూసి పైనున్న మబ్బులు కూడా గొంతు కలిపాయి. ‘జీవితం అంటే కన్నీళ్లు, కష్టాలు, ఊహించని విపత్తులు,’ అంటూ సాగిపోయాయి.

 

మబ్బులు మాట్లాడటం చూసి నదులు కూడా అరిచాయి ....’అదేమీ కాదు! జీవితం అంటే ఓ అంతులేని ప్రవాహం,’ అంటూ ముందుకు ఉరికాయి.

 

అలా జీవితం అంటే ఏమిటంటూ నిదానంగా మొదలైన చర్చ ఓ భీకరమైన వాదన కిందకి దారితీసింది. అన్ని జీవాలూ కలగాపులగంగా అరుచుకోవడం మొదలుపెట్టాయి. ఇంతలో ఆకాశవాణి వినిపించింది... ‘మీరు చెప్పిన జవాబులన్నీ అసంపూర్ణంగా ఉన్నాయి. నిజానికి జీవితం అంటే ఏ ఒక్క లక్షణమో కాదు. అందం, ఆటాపాటా, సంతోషం, స్వేచ్ఛ ఒకవైపునా..... కష్టం, బాధా, కన్నీరు, భయం, పని మరోవైపు సమంగా ఉండేదే జీవితమంటే. అలాంటి జీవితాన్ని అనుభవించే అదృష్టం ఒక్క మనిషికి మాత్రమే ఉంది,’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ మాటలతో జీవాలన్నీ ఏకీభవించక తప్పలేదు. మరి మీరో!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.