జీవితంలో ఏడు వింతలు...!

 

ఆ అమ్మాయి పేరు సరిత. తను ఉండే చిన్న పల్లెటూరిలో ఆరో తరగతి వరకే చదువుకునే అవకాశం ఉంది. అందుకే మిగతా చదువు కోసం పక్కనే ఉన్న పట్నానికి బయల్దేరింది. పట్నం బడిలో అడుగుపెట్టిన ఆ పల్లెటూరి పిల్లని చూడగానే అందరూ ఒక్కసారిగా ఫక్కున నవ్వారు. దూరం దూరం జరిగారు. కొత్త వాతావరణం, భయపెట్టే వాతావరణం... అందుకనే సరిత తల ఎత్తి కూడా చూడకుండా నేరుగా తరగతిలోకి వెళ్లి కూర్చుండిపోయింది.

 


బెల్లు కొట్టిన ఓ రెండు నిమిషాలకి తరగతిలోకి టీచర్‌ ప్రవేశించారు. సరిత వాలకం చూసి ఆమె కూడా నొసలు చిట్లించారు. ఆపై క్లాసులో పిల్లలందరినీ చూస్తూ- ‘ఇప్పటివరకూ మీకు ఏమాత్రం చదువు అబ్బిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకనే ఓ కాగితం తీసుకుని దాని మీద ఈ ప్రపంచంలోని ఏడు వింతలు ఏమిటో రాసి చూపించండి,’ అంటూ హుకుం జారీ చేసింది.

 


టీచరుగారు చెప్పడమే ఆలస్యం... క్లాసులో పిల్లలంతా హడావుడిగా తలో కాగితం చింపి దాని మీద ప్రపంచంలోని ఏడు వింతలనీ రాయడం మొదలుపెట్టారు. ఓ పది నిమిషాలు గడిచేసరికి అందరూ తమకు తెలిసిన ఏడు వింతల్నీ రాయడం పూర్తిచేసేశారు. కానీ సరిత మాత్రం ఇంకా రాస్తూనే ఉంది. ‘అదేంటీ! నువ్వు ఇన్నాళ్లూ చదువుకున్న బడిలో ఈ మాత్రం కూడా చెప్పలేదా!’ అంటూ చిరాగ్గా అడిగింది టీచర్.
‘చెప్పారు టీచర్‌. కానీ నాకు తోచిన సమాధానం రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఆలోచనలతో కాస్త ఆలస్యం అయ్యింది,’ అని సంజాయిషీ చెబుతూ తన కాగితాన్ని టీచరుగారి చేతిలో పెట్టింది సరిత.

 


టీచర్ నిదానంగా ఒకొక్కరి జవాబులనీ చదువుతూ కూర్చుంది. విద్యార్థులంతా తాము సరైన జవాబులు రాశామో లేదో అని మిగతావారితో గుసగుసలాడుకోసాగారు. వాళ్లలో చాలామంది ఏడు వింతలు అనగానే తాజ్‌మహల్‌, పిరమిడ్స్‌, గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా... లాంటి కట్టడాల గురించి రాశారు.

 

టీచర్‌ ఒకో కాగితం చూసుకుంటూ సరిత రాసిన జవాబు పత్రాన్ని చేతిలోకి తీసుకుంది. అందులో ఉన్నది చదవగానే నమ్మలేకపోతున్నట్లుగా కళ్లు చికిలించి మరీ చూసింది. ఆపై సరిత వంకా చూసింది. సరిత మొహంలో ఆమెకు ఏ భావమూ ప్రస్ఫుటం కాలేదు... ఒక్క అమాయకత్వం తప్ప!


ఏడు వింతలనగానే సరిత తన జవాబులుగా ఈ వింతలను పేర్కొంది- ‘చూడగలగడం, వినగలగడం, అనుభూతి చెందగలగడం, నవ్వగలగడం, ఆలోచించగలగడం, ఆలోచనలని వ్యక్తం చేయగలగడం, కరుణతో మెలగడం’. ఆ జవాబులని చదివిన టీచర్ కళ్లు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. ఒక పేద పల్లెటూరి పిల్ల జీవితంలోని నిజమైన ఏడు వింతలలూ ఏమిటో తెలుసుకోగలిగింది కదా! అనుకుంది. తన విద్యార్థులందరికీ ఆ ఏడు వింతల విలువా తెలియచేసినప్పుడే వారి చదువుకి అర్థం అనుకుంది. అందుకే సరిత జవాబులని బిగ్గరగా చదివి వినిపించింది. ఆ జవాబులని విన్న విద్యార్థులంతా ఒక్క క్షణం అబ్బురంగా సరిత వైపు చూశారు. వారి కళ్లలో ఇప్పుడు సరిత పట్ల చులకన లేదు. అలాంటి మనిషి తమ తరగతిలో ఉందన్న సంతోషం కనిపించింది.
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.