నిద్రలేమితో బాధపడుతున్న గర్భవతులకు ప్రమాద హెచ్చరిక


 

ఒక కొత్త అధ్యయనం ప్రకారం, నిద్రలేమి వలన గర్భిణీ స్త్రీలకి గెస్టేషనల్ (గర్భధారణ సమయంలో) మధుమేహం  వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గడచిన 20 ఏళ్ళలో దాదాపుగా పావు శాతం స్త్రీలు మరియు 16 శాతం పురుషులు నిద్ర లేమితో బాధపడుతున్నారు.

 

గర్భిణీ స్త్రీలు తరచుగా గర్భధారణ మధుమేహంతో బాధపడుతుంటారు. సాధారణంగా ఇది రెండవ లేదా మూడవ త్రైమాసికంలో సంభవిస్తుంది. గర్భిణీ స్త్రీలు 24 నుండి 28 వారాల గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలు జరుపుకుంటున్నారు. ఒకవేళ, షుగర్ లెవెల్స్ మోతాదు కన్నా ఎక్కువ ఉంటే గర్భధారణ మధుమేహం (గెస్టేషనల్ డయాబెటిస్) వచ్చే ప్రమాదం ఉంది.

 

సాధారణంగా, శిశువు జన్మించిన తర్వాత తల్లికి రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. అమ్మకి గర్భధారణ మధుమేహం ఉన్నట్లయితే, జన్మించిన శిశువులు అధిక బరువు కలిగి ఉంటారు. అమ్మలకి తర్వాత టైప్ -2 మధుమేహం వచ్చే అవకాశాలుంటే, పిల్లలకి కూడా మధుమేహంతో పాటు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

 

సగటున 6 గంటల కంటే తక్కువ నిద్ర పోతున్నట్లయితే, గర్భధారణ మధుమేహం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ అధ్యయనం చెబుతుంది. కాబట్టి, గర్భిణులు రోజుకి ఖచ్చితంగా 6 గంటలు పైగా నిద్రపోయేలా ప్రణాళిక చేసుకోవాలి లేదా వారికి వారి పిల్లలకి షుగర్ తో పాటు ఊబకాయం కొని తెచ్చుకున్నట్లే!