రెండోసారి మోదీ సర్కార్ లో ఆర్ధిక పరిస్థితులు.. మొదటిసారి కంటే 87 శాతం తక్కువ

 

మోదీ సర్కార్ రెండో సారి అధికారానికి వచ్చిన తరువాత దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే చెబుతున్నారు నిపుణులు. ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా ప్రవేశ పెట్టిన వస్తు సేవల పన్ను.. జీఎస్టీ వసూళ్లు.. అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రతి నెలా జీఎస్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో కూడా జీఎస్టీ వసూళ్లు 5.29 శాతం తగ్గాయి. గత ఏడాది అక్టోబర్ లో లక్ష కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలైతే ఈ ఏడాది 95,000 కోట్లకు పరిమితమైంది. పండుగ సీజన్ లో ఆన్ లైన్ సేల్స్ పెరగడంతో పన్ను వసూళ్లు తగ్గాయని పన్నుని 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీనివల్ల దీపావళి పండుగ నాటికి ధరలు బాగా తగ్గి అటు పట్టణ ప్రాంతాల్లోనూ ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగ వస్తువుల విక్రయం పెరిగింది. కంపెనీల లాభాల్లో కూడా పెరుగుదల కనిపించింది. లాభాలు వచ్చిన రంగాల్లో ఉత్పత్తులు పెంచేందుకు.. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు.. అవకాశం వచ్చింది. వాణిజ్యంలో ప్రభుత్వ మితిమీరిన జోక్యం కూడా శాపంగా పరిణమించింది. బ్యాంక్లు, ఎయిర్ లైన్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిత్యం ప్రభుత్వ సాయం పైనే ఆధారపడుతున్నాయి.చాలా వరకు నగదు ఈ 3 రంగాలకే పరిమితం అవుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం చాలా వరకు భారాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఎక్కడ నుంచి లక్షల కోట్లు సేకరించాలనే అంశంలో ప్రభుత్వానికి స్పష్టత అవసరం.

వచ్చే 5 ఏళ్ల కాలంలో మౌలిక రంగంపై 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఏటా 20 లక్షల కోట్లు వ్యయం చేయాలి. అంటే ప్రస్తుతం చేస్తున్న వ్యయం కంటే చాలా ఎక్కువ పెట్టాలి. దేశీయంగా డిమాండ్ తగ్గుతుందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. పండుగల సీజన్ లో వినియోగ వస్తువుల కొనుగోలు కాస్త పెరిగినా సగటున తగ్గిందనేది అందరికీ తెలిసిన విషయమే. వచ్చే బడ్జెట్ లో ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. తయారీరంగంలో పన్ను రాయితీలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడకపోవచ్చు. ఇందులో భాగంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచే చర్యలు చేపట్టాలి. దేశంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరగడం మినహా ప్రైవేటు పెట్టుబడులు పెరగడం లేదు. పైగా జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 43,000 ల కోట్ల కొత్త ప్రాజెక్టులను మాత్రమే ప్రకటించారు. గతేడాదితో పోల్చితే ఇది 87 శాతం తక్కువ. రైల్వేలు, రోడ్లు, విద్యుత్ రంగంలో 11 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆగిపోయాయి. అందుకే ప్రైవేటు పెట్టుబడులు వస్తేనే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని గుర్తించాలి. ప్రైవేటు పెట్టుబడులు వస్తేనే జనం చేతిలో డబ్బులు ఉంటాయి. లాభాలు వస్తాయన్న నమ్మకం ఉంటేనే ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెడతాయి.వారికి కూడా తక్కువ వడ్డీకి రుణాలు అవసరం.

మోదీ సర్కారు అధికారానికి వచ్చిన తరువాత ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ఏర్పాట్లను అక్టోబరు రెండో వారంలోనే చేపట్టారని చెప్పొచ్చు. తయారీ రంగానికి రియల్ ఎస్టేట్ కు ఉద్దీపనల ద్వారా ఆమె రాబోయే బడ్జెట్ ఎలా ఉంటుందో కొంతవరకు చెప్పేశారు. భూసేకరణ, భూసంస్కరణలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దేశంలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి భూ సేకరణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలి. కార్మిక చట్టాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా మార్చాలి. భూసేకరణ, కార్మిక చట్టాల విషయంలో సింగూరు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. దీర్ఘ కాలిక ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘ కాలిక ప్రాజెక్టులకు రుణాలు అందించే విధంగా బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉండాలి. అప్పుడే ఆర్థిక వృద్ధి రేటు గాడిలో పడే వీలుంది.