అమెరికా కస్టడీలోనే భారతీయుడి మృతి..

 

ఇమ్మిగ్రేషన్ పత్రాలు సరిగా లేవంటూ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఓ భారతీయుడిని కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ భారతీయుడు ఆస్పత్రిలో మృతి చెందాడు. వివరాల ప్రకారం.. అతుల్ కుమార్ బాబూభాయ్ పటేల్ మే పదో తేదీన ఈక్వెడార్ నుంచి వచ్చిన ఓ విమానంలో ఆయన అట్లాంటాలో దిగారు. అక్కడ తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేవంటూ అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు..ఆయనను అట్లాంటాలోని సిటీ డిటెన్షన్ సెంటర్‌లోనే ఉంచేశారు. సిటీ డిటెన్షన్ సెంటర్‌లో ఉండగా ఆయనకు ప్రాథమిక వైద్యపరీక్షలు చేసినప్పుడు హైబీపీ, డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆయన డయాబెటిస్ చూస్తున్న ఓ నర్సు.. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా, అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారతీయ రాయబార కార్యాలయానికి పటేల్ మృతి గురించి సమాచారం అందించగా, వాళ్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు.