ఇక సర్వేలతో పనిలేదు.. వైసీపీ వాళ్ళ ముఖాలు చాలు!

మొన్నటి వరకు నేషనల్ ఛానల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ పరిస్థితి ఏమిటో తమతమ సర్వేల ద్వారా తెలిపాయి. ఏ ఛానెల్ లేదా సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే అయినా ఒకే రిపోర్టు ఇచ్చింది.. ఈసారి ఎన్నికలలో ఏపీలో వైసీపీ ఓడిపోతుంది.. టీడీపీ కూటమి విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకు చాలా సర్వేలు విడుదలయ్యాయి. అన్ని సర్వేల ఫలితం ఒకటే.. వైసీపీ ఖేల్ ఖతమ్ అనే. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతోపాటు పార్లమెంట్ స్థానాలను కూడా ఆ పార్టీ భారీగా కోల్పోబోతోందని సర్వేలు తేల్చాయి. ఈ సర్వేలన్నీ దాదాపుగా కోడికత్తి-2 సంఘటనకు ముందు చేసినవే.. ఈ సంఘలనకు ముందు వైసీపీకి 30 వరకు సీట్లు వచ్చే అవకాశం వుందని ఓవరాల్‌‌గా చెప్పాయి. అయితే ఈ సంఘటన తర్వాత జనం ఆలోచనలో ఇంకా బాగా మార్పు వచ్చిందని, ఈ నాటకాన్ని వారు అసహ్యించుకుంటున్న నేపథ్యంలో ముందుగా అనుకున్న సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి సర్వేలకు కామా పడింది. పోలింగ్ పూర్తయిన తర్వాత సర్వేల పరంపర ఎలాగూ కొనసాగుతుంది. మరి ఈ మధ్యకాలంలో సర్వేలు లేకపోతే ఎలా? ఏం పర్లేదు.. సర్వేలు లేకపోయినా వైసీపీ నాయకుల ముఖాలు చూస్తే చాలు.. ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో అర్థమైపోతుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాటని పెద్దలు ఊరకే అనలేదు. ముందుగా త్వరలో మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ముఖం చూడండి.. ఆయన ముఖంలో భూతద్దం పెట్టి వెతికినా ఏ మూలనా కళ అనేది కనిపించడంలేదు. కూటమి ధాటికి ‘ఓటమి’ అనేది ఆయన ముఖంలో క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తోంది. ఇక ఇతర వైసీపీ నాయకుల ముఖాలు చూస్తే, అందరి ముఖాల్లో ఓటమి కళ సెవెన్టీ ఎంఎంలో కనిపిస్తూ వుంటుంది. పాపం అదేంటో, వైసీపీ నాయకులు నోటితో గెలుస్తాం అని చెబుతూ వుంటే, ముఖాలు మాత్రం ఓడిపోతాం అని చెప్పకనే చెబుతున్నాయి. 
Publish Date: Apr 26, 2024 3:05PM

కడప జిల్లాలో వైసీపీ ఓటమికి బాటలు వేసిన జగన్ వ్యాఖ్యలు!

ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ముఖ్యంగా గురువారం (ఏప్రిల్ 25)న పులివెందులలో జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి, స్వయంగా ఆయన ప్రతిష్టకు తీరని నష్టం చేకూర్చాయని విశ్లేషిస్తున్నారు. అడబిడ్డపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల సామాన్య జనంలో కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సరిగ్గా ఎన్నికల ముందు జగన్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల ప్రభావం ఒక్క పులివెందుల నియోజకవర్గానికే పరిమితం కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట చెల్లెలి చీర రంగుపై జగన్ చేసిన వ్యాఖ్య జగన్ చేసిన పెద్ద బ్లండర్ గా అభివర్ణిస్తున్నారు.  ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వైసీపీకి పెట్టని కోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో కూడా వైసీపీ ఓటమికి బాటలు పరిచాయంటున్నారు.  నిజానికి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో సొంత చెల్లెలు షర్మిల, వివేకా కుమార్తె సునీత గత కొన్నినెలలుగా తనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా జగన్ ఇప్పటి వరకూ వారికి కౌంటర్ ఇవ్వలేదు. అసలు పట్టించుకోనట్లుగానే ఉన్నారు. వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా షర్మిల, సునీతలపై విమర్శలు చేశారు. వారి వ్యక్తిగత విషయాలపై కూడా కామెంట్లు పెట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ జగన్ మాత్రం ఓ మేరకు సంయమనం పాటించారు. ఇక వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా కూడా షర్మిల, సునీతల వ్యాఖ్యలు, విమర్శలపై స్పందించడం మానేసిన తరుణంలో జగన్ తన చెల్లెలి చీర రంగుపై చేసిన వ్యాఖ్యతో  ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. సామాన్య జనం కూడా జగన్ దిగజారి మాట్లాడారని అంటున్నారు. బాహాటంగానే జగన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. షర్మిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా స్వయంగా జగన్ కే కాదు పార్టీకి కూడా తీరని నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్న వ్యాఖ్యలకు షర్మిల ఇచ్చిన సమాధానం జగన్ ఇప్పటి వరకూ ఓన్ చేసుకుంటూ వస్తున్న వైఎస్ వారసత్వాన్నే ఆయనకు దూరం చేసేలా ఉందని  అంటున్నారు. ఇంతకీ జగన్ సంయమనం కోల్పోయి సొంత చెల్లెలని కూడా చూడకుండా ఆమె వ్యక్తిత్వాన్నే కించపరిచేలా మాట్లాడడానికి కారణం ఫస్ట్రేషనే అంటున్నారు పరిశీలకులు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వైఎస్ వివేకా హత్య కేసులో అందరి అనుమానాలూ అవినాష్ రెడ్డిపైనే ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు, కోర్టుల్లో విచారణ కూడా ఆ అనుమానాలు కేవలం అనుమానాలు కావనే విధంగానే సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ అవినాష్ ను వెనకేసుకు రావడం,  చెల్లెళ్లపై ఎదురుదాడికి దిగడం, వారిని ప్రత్యర్థులు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారంటూ విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేకపోగా ప్రతికూలతే ఎక్కవగా కనిపిస్తోంది.   ఇప్పుడు తాజాగా జగన్ షర్మిల చీర రంగుపై చేసిన వ్యాఖ్యలతో ఇటీవలి కాలంలో పెద్దగా వినిపించని ప్రశ్నలు కూడా సామాన్య జనం నుంచి వినవస్తున్నాయి.  వివేకా హత్య కేసులో విపక్ష నేతగా సిబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ ను జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఒక వేళ అవినాష్ ఆరోపిస్తున్నట్లు వివేకా హత్యలో సునీత, ఆమె భర్త ప్రమేయం ఉంటే సునీత స్వయంగా సీబీఐ విచారణ కోరుతూ కోర్టు ను ఆశ్రయించి మరీ ఎందుకు సాధించారు. అంటూ జనం చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పులివెందులలో గురువారం (ఏప్రిల్ 25) నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ చెల్లెలి చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలు ఎన్నిలకపై తప్పక ప్రభావం చూపుతాయని పరిశీలకులు అంటున్నారు.  
Publish Date: Apr 26, 2024 2:28PM

చెల్లి వాటా చెల్లికి ఇచ్చేయొచ్చు కదా జగన్?!

ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే.. నువ్వు చెల్లికి అప్పు ఇచ్చినట్టు వుంది.. కానీ, అది అప్పు కాదని, తనకు ఆస్తిలో వాటాగా రావలసిన చాలా డబ్బులో కొంత డబ్బుని ‘అప్పు’ రూపంలో ఇచ్చావంటా? ఈ విషయం మాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకు.. చెల్లెమ్మ చేతికి మైకు ఇస్తే చాలు ముందుగా తనకు రావలసిన తన ఆస్తి గురించే మాట్లాడుతోంది మరి. ఆమె అలా రోడ్డు మీదకి వచ్చి తన ఆస్తి గురించి లబోదిబో అంటోంది కాబట్టి, ఇష్యూ పబ్లిక్‌లోకి వచ్చేసింది కాబట్టి మీ కుటుంబ ఆస్తి వివరాల గురించి మాట్లాడే అవకాశం అందరికీ మీరే ఇచ్చినట్టు అయింది. ఆ మహానేత, నాన్నగారు పోయిన తర్వాత ఆయన ‘కష్టపడి’ సంపాదించిన మొత్తం అన్నాచెల్లెళ్ళు మీరిద్దరూ పంచుకోవాలి కదా.. ఆయన కీర్తిశేషుడై చాలా సంవత్సరాలైంది. ఇంతవరకు ఆస్తుల పెంపకం ప్రస్తావన తేకుండా మొత్తం నీ దగ్గరే వుంచేసుకుంటే ఎలా జగన్ బ్రో? పాపం ఆయన ఊహించని విధంగా అకస్మాత్తుగా చనిపోయారు. ఒకవేళ ఆయనే బతికుంటే, చక్కగా ఆస్తిమొత్తాన్నీ ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చి వుండేవారు కదా? తండ్రి తర్వాత తండ్రి లాంటి నువ్వు పాపం నీ చెల్లికి తండ్రి లేని లోటు తీర్చి ఆస్తి పంచి ఇస్తే ఇప్పుడు పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. ఆస్తి వస్తుంది, పోతుంది.. ఆత్మీయతలు, అనురాగాలు పోతే తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. అందుకని ఒక్కగానొక్క చెల్లిని ఏడిపించకుండా ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తి ఆమెకి ఇస్తే మీ అనురాగాలు కొనసాగుతాయి.. అంతేకాదు.. పైన వున్న మీ నాన్న వైఎస్సార్, తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకా కూడా చాలా సంతోషిస్తారు. అయినా అంత డబ్బు ఏం చేసుకుంటావ్ జగన్? మీ తాత, మీ నాన్న అంత సంపాదించి ఏం చేసుకున్నారు? ఒక్క రూపాయి అయినా తీసుకెళ్ళారా? ఎవరైనా అంతే, మొన్న కంటికి పైన తగిలిన రాయి ఏ కణతకో తగిలి వుంటే పరిస్థితి ఏమయ్యేది? అందుకని, ఇప్పటి వరకు అయిన రచ్చ చాలు.. ఇక ఈ రచ్చకి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన బాధ్యత నీదే.
Publish Date: Apr 26, 2024 1:52PM

నా బిడ్డను అన్యాయంగా అరెస్టు చేశారు.. కేసీఆర్ సెంటిమెంట్ ఓట్లు రాలుస్తుందా?

కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు. బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటున్నారు. బస్సు యాత్రకు ముందు ఓ టీవీ చానెల్ లో మాట్లాడిన ఆయన మేడిగడ్డ కుంగుబాటు చాలా చిన్నదనీ, అటువంటివి సహజమనీ చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఫోన్ ట్యాపింగ్ ను కూడా ఆయన అటువంటిది జరిగితే అది అధికారుల తప్పు తనకేం సంబంధం అని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇలా అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో  ముఖ్యమంత్రిగా తాను రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంగా పని చేశానని చెప్పుకున్నారు. అయితే ఆయన మాటలను జనం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ పండించైనా సరే ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం మొదలు పెట్టారు.  తెలంగాణను పార్టీ పేరు నుంచే దూరం చేసుకున్న ఆయన ఇప్పుడు తెలంగాణ సాధకుడిని అని చెప్పుకుంటే జనం మెచ్చరనుకున్నారో ఏమో.. కుమార్తె అరెస్టు అంశాన్ని ఎత్తుకున్నారు.  తన బిడ్డను అక్రమంగా అరెస్టు చేశారంటూ సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నిస్తున్నారు.  మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన తరువాత చాలా రోజుల వరకూ కనీసం స్పందించలేదు. అదే కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేసినప్పుడు ఖండించిన కేసీఆర్.. తన కుమార్తె అరెస్టుపై మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తరువాత ఎన్నికల ప్రచారంలో కవితను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ సానుభూతి పొందే యత్నం చేస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా భువనగిరిలో ఆయన మాట్లాడుతూ..కవిత అరెస్టు విషయాన్ని ప్రస్తావించారు. తప్పుడు కేసులో కవితను బీజేపీ సర్కార్ జైల్లో పెట్టిందన్న కేసీఆర్ ఈ సంఘటన బీజేపీ కపటత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు. తన కుమార్తెకు నిజంగా మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉంటే అసెంబ్లీ ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.    వాస్తవానికి కవిత అరెస్టైన సందర్భంలోనే తెలంగాణ సమాజం సీరియస్ గా తీసుకోలేదు.  ఆమె అరెస్టైన సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసనల పిలుపునకు ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. అప్పట్లో కవిత అరెస్టు సార్వత్రిక ఎన్నికలలో  కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి.    తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ పితగా నిన్నటి వరకూ ప్రజల మన్ననలు అందుకున్న కేసీఆర్ తనయను ఈడీ అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదు. రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగలేదు. చాలా ఉదాశీనంగా వ్యవహరించారు. ఇక కవిత పట్ల ప్రజల నుంచే కాదు, పార్టీ శ్రేణుల నుంచి కూడా ఏ మంత సానుభూతి లభించలేదు. పైపెచ్చు అవినీతికి పాల్పడితే అనుభవించక తప్పదుకదా అన్న వ్యాఖ్యలూ వినవచ్చాయి. వాటన్నిటి కారణంగానే కేసీఆర్ కవిత అరెస్టుపై స్పందించేందుకు వెనుకాడారనీ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఇక లోక్ సభ ఎన్నికల ముంగిట కవిత అరెస్టును తురుఫు ముక్కగా వాడుకోవాలని చూస్తున్న కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది. 
Publish Date: Apr 26, 2024 12:44PM

గుడివాడ, గన్నవరం వైసీపీలో కనిపించని జోష్.. ముందుగానే చేతులెత్తేసిందా?

గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ  విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇరువురూ కూడా తెలుగుదేశంతో రాజకీయ అడుగులు మొదలు పెట్టిన వారే. అయితే కొడాలి నాని ముందుగా వైసీపీలోకి జంప్ కొడితే.. గత ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన తరువాత గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జంప్ కొట్టారు. ఇరువురూ కూడా తెలుగుదేశం అధినేతపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నవారే. వారిరువురూ వారి వారి నియోజకవర్గాలలో తిరుగులేని నేతలుగా ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు. తీరా ఈ ఎన్నికలలో నామినేషన్ వేసే సమయానికి వారిరువురి ధీమా సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. ఒక వైపు తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీ ఆర్భాటంగా ప్రజల భాగస్వామ్యంతో జరిగితే.. కొడాలి నాని, వల్లభనేని వంశీల నామినేషన్ ర్యాలీలో ప్రజా భాగస్వామ్యం మాట అటుంచి కనీసం పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం కనిపించలేదు. దీంతో ఇరువురిలోనూ ఓటమి భయం తీసుకువచ్చిన అసహనం పెచ్చరిల్లుతోందని అంటున్నారు.  ముందుగా కొడాలి నాని విషయం తీసుకుంటు.. భారీ ర్యాలీతో తన నామినేషన్ ర్యాలీ నిర్వహించాలని కొడాలి నాని భావించారు. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని పార్టీ క్యాడర్ కు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే గురువారం ( ఏప్రిల్ 25) కొడాలి నాని నామినేషన్ ర్యాలీ చూసిన వారు జోష్ కనిపించలేదంటున్నారు. అనుకున్న స్థాయిలో  జనం రాకపోవడంతో కవర్ చేసుకుందుకు తన నివాసం నుంచి కొడాలి నాని ర్యాలీని ఇరుకు సందుల గుండా నిర్వహించారు.  ఈ ర్యాలీలో నానితోపాటు వైసీపీ మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్‌, జడ్పీ  చైర్‌పర్సన్‌ ఉప్పల హారిక, పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. అనుకున్నస్థాయిలో  పార్టీ కార్యకర్తలు సైతం రాలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వచ్చిన వారు కూడా ఏదో మమ అన్నట్లుగా ర్యాలీలో పాల్గొన్నారు కానీ ఎవరిలోనూ నాని విజయం పట్ల ధీమా కనిపించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నినాదాలలో జోష్ కనిపించలేదనీ, ర్యాలీని ఇరుకు రోడ్ల గుండా నిర్వహించడమే  ఆ ర్యాలీకి స్పందన కనిపించలేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. మొత్తం మీద గుడివాడలో కొడాలి నాని నామినేషన్ ర్యాలీ వెలవెలబోయి ఆయన గాలి తీసేసిందని అంటున్నారు.   భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన చేయాలని ఎంతగా ప్రయత్నించినా జనం మాత్రం రాలేదు. అసలు నాని ప్రచారంలోనే ఆయనకు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిని ఇసుమంతైనా పట్టించుకోని నానికి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైన దాఖలాలు లేవు. పైపెచ్చు ఎక్కడికక్కడ నిలదీతలు, నిరసనలే వ్యక్తం అయ్యాయి. అదే ఆయన నామినేషన్ ర్యాలీలోనూ ప్రతిఫలించింది. దీంతో నామినేషన్ ర్యాలీని తెలుగుదేశం కార్యాలయం మీదుగా నిర్వహించి గొడవలు సృష్టించాలని నాని వర్గం చేసిన ప్రయత్నం కూడా ఆ రూట్ లో ర్యాలీకి పోలీసులు ససేమిరా అనడంతో విఫలమైంది. రెండు రోజుల ముందుగానే గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెనిగండ్ల రాము ఆ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ప్రజా భాగస్వామ్యంతో కళకళలాడింది. వేలాది మందితో సాగిన ఆయన నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించిందని స్థానికులు వ్యాఖ్యానించారు.    ఇహ ఇప్పుడు గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ నామినేషన్‌  సందర్భంగా జరిగిన ర్యాలీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ర్యాలీకి జనాలను తరలించేందుకు  పెద్దఎత్తున డబ్బు, మద్యం, బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ జరిగినా ప్రజలు మాత్రం ర్యాలీలో పాల్గొనేందుకు పెద్దగా ఉత్సాహం చూపలేదు.  ఆశించిన స్థాయిలో  జనాలు రాకపోవడంతో  వంశీ అసహనానికి లోనయ్యారు. నామినేషన్ అనంతరం ఆయన ప్రసంగంలో అది స్పష్టంగా ప్రతిఫలించింది.  గన్నవరం నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయిల్లో పలువురు నాయకులు తెలుగుదేశం గూటికి చేరిపోయారు. దీంతో క్షేత్రస్థాయిలో వైసీపీకి నాయకత్వమే లేకుండా పోయింది.  అదే గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ వేలాది మందితో ఆద్యంతం ఉత్సాహంగా జారింది. ఈ ర్యాలీతో పోల్చి నామినేషన్ ర్యాలీయే గన్నవరం ఫలితాన్ని తేల్చేసిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో వైసీపీలో జోష్ కనిపించడం లేదనీ, క్యాడర్ లో ఉత్సాహం కానరావడం లేదనీ, అదే ఆయా నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల ర్యాలీలో ప్రతిఫలించిందనీ చెబుతున్నారు.  
Publish Date: Apr 26, 2024 11:11AM

ఏపీలో భానుడి భుగభగలు

ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా శక్రవారం (ఏప్రిల్ 26) రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 174 మండలాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఇక రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 25)నంద్యాలలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే విజయనగరం జిల్లా రాజాంలో 45.5, అల్లూరి జిల్లా కొండై గూడెంలో 45.1, కడన జిల్లా ఖాజీపేటలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 
Publish Date: Apr 26, 2024 11:08AM