ఆసిస్ స్పీన్‌కు 105కే కుప్పకూలిన టీమిండియా

ఆస్ట్రేలియాతో పుణేలో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా చేతులేత్తేసింది. ఆసీస్ స్పిన్ ఎటాక్‌కు తట్టుకోలేక..క్రీజ్‌లో నిలబడటానికే అపసోపాలు పడుతూ వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి భారత్‌కు షాకిచ్చాడు. అయితే రాహుల్, రహానే నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినప్పటికి ఓకిఫ్ మళ్లీ విజృంభించి వాళ్లిద్దరిని పెవిలియన్‌కే పంపాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, సాహాలు డకౌట్ కాగా మిగిలిన వారు రెండంకెల స్కోరు చేయడానికి నానా తంటాలు పడ్డారు. దీంతో 40.1 ఓవర్లలో భారత్ 105 పరుగులకే కుప్పకూలి ఆసీస్‌కు 155 పరుగుల ఆధిక్యాన్ని అందించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఓకీఫ్ 6, మిచెల్ స్టార్క్ 2, హేజేల్‌వుడ్, నాథన్ లయన్ చేరో వికెట్ తీసుకున్నారు. భారత బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.