ఇండిగోలో ఈ గోలేంటి..?

 

మ‌నం బ్యాంకుల్లో కానీ.. మ‌రేదైనా చోట కానీ ఓ ఫ్రేమ్ చూస్తూ ఉంటాం. "ఖాతాదారుడు మ‌న‌కు అత్యంత విలువైన వ్య‌క్తి ఎందుకంటే మన‌పై అత‌ను ఆధార‌ప‌డి లేడు.. మ‌న‌మే అత‌నిపై ఆధార‌ప‌డి ఉన్నాము" అంటూ జాతిపిత మ‌హాత్మాగాంధీ నిర్వ‌చించిన‌ట్లుగా ఓ సూక్తి క‌నిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే గ‌తకొద్ది రోజులుగా ప్ర‌ముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో వైఖ‌రి చూస్తుంటే ఆ మ‌హానుభావుడు ఎందుకు అలా చెప్పాల్సి వ‌చ్చిందో అర్థం చేసుకోవ‌చ్చు.  కొద్ది రోజుల క్రితం తెలుగుతేజం, ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణీ పీవీ సింధుతో ల‌గేజ్ విష‌యంలో గ్రౌండ్ స్టాఫ్ లోని అజితేష్ అనే వ్య‌క్తి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. స్వ‌యంగా సింధు త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని ట్విట్ట‌ర్ వేదికగా పంచుకున్నారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇలాంటి సంఘ‌ట‌న జ‌రిగినా ఏమాత్రం గుణ‌పాఠం తెచ్చుకోని ఇండిగో సిబ్బంది మ‌రోసారి దుస్సాహాసానికి ఒడిగ‌ట్టారు. రాజీవ్ క‌టియాల్ అనే ఓ ప్ర‌యాణికుడు అక్టోబ‌ర్ 15న ఇండిగో విమానంలో ఢిల్లీ వెళ్లారు. అయితే విమానాశ్ర‌యంలో దిగిన త‌ర్వాత ఆయ‌న టార్మాక్ వ‌ద్ద నిలిపి ఉంచిన బ‌స్సుల వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ద‌గ్గ‌ర‌లోని చెట్టు వ‌ద్ద‌కు వెళ్లారు. అయితే ఆయ‌న నో ఎంట్రీ జోన్ లో ఉన్న‌ట్లు  సిబ్బంది గుర్తించారు. త‌న వ‌ద్ద టికెట్ వుంద‌ని.. వ‌చ్చేస్తాన‌ని చెప్పి  వెళ్లిపోతున్న ఆయ‌న‌ను టార్మాక్ సిబ్బంది తోచేశారు. పీక ప‌ట్టుకుని దాడికి దిగారు. క‌నీసం ఆయ‌న వ‌య‌సుకైనా గౌర‌వం ఇవ్వ‌కుండా అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించిన సిబ్బంది తీరుపై ప్ర‌జ‌లు, నెటిజ‌న్ల నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గౌర‌వించుకోవాల్సిన ప్ర‌యాణికుల‌పై భౌతిక దాడుల‌కు దిగ‌డం స‌బ‌బు కాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఇండిగో  ఎయిర్ లైన్స్ వ‌రుస వివాదాల‌పై కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు స్పందించారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై వెంట‌నే నివేదిక ఇవ్వాల‌ని.. దాడికి పాల్పడిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికైనా ఇండిగో య‌జ‌మాన్యం స‌వ్యంగా వ్య‌వ‌హ‌రించ‌కుంటే క‌నుమ‌రుగైన విమానాయాన కంపెనీల జాబితాలోకి చేరిపోవ‌డం ఖాయం.