ఇండిగో ఎయిర్ లైన్స్.. ఏంటి ఈ గోల..?

 

ఈ మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ తెగ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది వల్ల చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. అది మరువక ముందే మళ్లీ మరో ఘటన చోటుచేసుకుంది. రాజీవ్ కటియాల్ (53) అనే వ్యక్తి అక్టోబరు 15న ఇండిగో విమానంలో న్యూఢిల్లీ వెళ్లారు. విమానాశ్రయంలో దిగిన తరువాత ఆయన టార్మాక్ వద్ద నిలిపి ఉన్న బస్సుల వద్దకు వెళ్లారు. ఎండ ఉండటంతో వేడికి తాళలేకపోయిన ఆయన అక్కడికి దగ్గర్లోని చెట్టువద్ద నిల్చున్నారు. రాజీవ్ కటియాల్  'నో ఎంట్రీ జోన్‌'లో నిల్చున్నట్లు టార్మాక్ సిబ్బంది గుర్తించారు. తన వద్ద టిక్కెట్ ఉందని చూపించినా..వచ్చేస్తానని చెప్పిమీ పని మీరు చూసుకోండీ అంటూ సమాధానం చెప్పి వెళ్లి పోతున్న ఆయనను ఇండిగో స్టాఫ్ మెంబర్ తోసేయడమే కాక, ఆయనను కింద తోసేసి, పీక పట్టుకున్నాడు. ఇంకేముంది ఇది పెద్ద దుమారమే రేపుతోంది. కనీసం పెద్దాయన అని కూడా చూడకుండా ఇలా ప్రవర్తించడం దారుణమని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మరోవైపు ఈ వివాదంపై విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తీవ్రంగా స్పందించారు. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ఆయన, దాడికి పాల్పడిన వారికి సమన్లు జారీ చేయాలని, వారి వివరణ తీసుకుని, వారిపై ఏ చర్యలు తీసుకున్నారన్న విషయాన్ని తనకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రయాణికులు ఏవైనా అనుచిత ఘటనలకు పాల్పడ్డప్పుడు ఎంత తీవ్రంగా చర్యలు తీసుకుంటామో, ఎయిర్ లైన్స్ సిబ్బంది అటువంటి ఘటనలకు పాల్పడితే ఇంకా సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యమూ ఏదో ఒక వివాదమేంటని ఇండిగో ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది.