రాహుల్ గాంధీ, రవుల్ విన్సి ఒక వ్యక్తేనా? నామినేషన్‌ డౌటేనా?

 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్‌ను తిరస్కరించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి ధృవ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అఫిడఫిట్‌లో పేర్కొన్న వివరాలు సైతం తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నామినేషన్ పరిశీలనను రిటర్నింగ్ అధికారి రాంమనోహర్ మిశ్రా ఈ నెల 22కు వాయిదావేశారు. ఇప్పుడీ వ్యవహారం దేశరాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

దీనిపై ధృవ్‌లాల్ తరపు న్యాయవాది రవి ప్రకాష్ మాట్లాడుతూ.. తాము ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావించినట్టు చెప్పారు. 'యూకేలో రిజిస్టర్ అయిన ఒక కంపెనీ సర్టిఫికెట్‌లో యూకే పౌరుడిగా రాహుల్ డిక్లేర్ చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయేతరుడు భారతదేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయరాదు. ఎందువల్ల ఆయన బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు భారతదేశ పౌరసత్వం ఎలా పొందారు? దీనిపై ఒక స్పష్టత వచ్చేంత వరకూ రాహుల్ నామినేషన్ పేపర్లను ఆమోదించరాదని రిటర్నింగ్ అధికారిని మేము కోరాం' అని ప్రకాష్ తెలిపారు.

యూకే కంపెనీకి సంబంధించిన ఆస్తుల వివరాలను ఎలక్షన్ అఫిడవిట్‌లో రాహుల్ ప్రస్తావించలేదని, రాహుల్ విద్యార్హతలపైనా అనుమానాలున్నాయని, డాక్యుమెంట్లలో ఆయన విద్యార్హతలు కూడా మ్యాచ్ కావడం లేదని అన్నారు. కాలేజీలో ఆయన పేరు 'రవుల్ విన్సి' అని ఉందని, రాహుల్ గాంధీ పేరుతో ఎలాంటి సర్టిఫికెట్ లేదని తెలిపారు. 'రాహుల్ గాంధీ, రవుల్ విన్సి ఒక వ్యక్తేనా అనేదే మా ప్రశ్న. అలాకాకుంటే ఆయన ఒరిజనల్ సర్టిఫికెట్ ఇస్తే వెరిఫై చేయడానికి వీలుంటుంది' అని రవిప్రకాష్ అన్నారు. దీంతో ఇప్పుడు రాహుల్ నామినేషన్‌పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.