పాకిస్తాన్ కు మనకన్నా ఒక్క రోజు ముందే స్వతంత్రం ఎందుకొచ్చింది?

 
ఆగస్ట్ 15, 1947న ఏం జరిగింది? ఈ ప్రశ్నకి భారతదేశంలో ఎవరైనా ఠక్కున సమాధానం చెప్పేస్తారు! డెబ్బై ఏళ్ల కింద ఆ రోజున మనకు స్వేచ్ఛ లభించింది! కానీ, విషాదంగా, బ్రిటీష్ వెళ్లిపోయిన అదే రోజున పాకిస్తాన్ మనకు పక్కలో బల్లెంలా తయారై కూర్చుంది! ఆగస్ట్ 15, 1947నే ఆనాటి పాకిస్తాన్ కూడా ఏర్పాటైంది! ఆ దేశ మొదటి స్వాతంత్ర దినోత్సవం కూడా అదే నాడు జరిగింది! మరి ఇప్పుడెందుకు ఆగస్ట్ 14న… ఒక్క రోజు ముందే… పాక్ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది?

 

నిజానికి… పాకిస్తాన్ ఇండియాతో పాటే… ఆగస్ట్ 15న ప్రతీ యేడూ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. కాని, తన సెకండ్ ఇండిపెండెన్స్ డే నాటి నుంచీ ఆ దేశం భారత్ కంటే ఒక్క రోజు ముందుగా వేడుకలు జరుపుకుంటోంది! దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథే వుంది!

 

1947లో మనకు స్వాతంత్రం రావటానికి ముందు… 1945 ఆగస్ట్ 15వ తేదీన జపాన్ బ్రిటీష్ వారి ముందు లొంగిపోయింది! దాంతో రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసిపోయింది. అదే రోజున రెండేళ్ల తరువాత మనకు స్వతంత్రం ప్రకటించింది బ్రిటన్! ఆ దేశ అధికారిగా మన దేశంలో అప్పట్లో వున్నది మౌంట్ బ్యాటన్! వైస్రాయ్ గా వున్న ఆయన 1947లో … ఆగస్ట్ 15న జపాన్ పై బ్రిటీష్ విజయానికి సంకేతంగా జరిగిన వేడుకల్లో పాల్గొనాలని భావించాడు! అంతే కాదు, ఆగస్ట్ 15న న్యూ దిల్లీలో జరిగే భారత తొలి స్వతంత్ర వేడుకల్లోనూ పాల్గొనాలని భావించాడు! ఈ రెండు కారణాల చేత పాకిస్తాన్ కు ఒక రోజు ముందే, అంటే ఆగస్ట్ 14, 1947న స్వతంత్ర ప్రకటించేశాడు!

 

ఒక రోజు ముందే స్వేచ్ఛ లభించినా కూడా పాకిస్తాన్ 1947లో ఇండియాతో పాటే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంది. ఆ రోజు రంజాన్ నెల చివరి శుక్రవారం కూడా కావటంతో ప్రపంచ వ్యాప్త ముస్లిమ్ లు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని జిన్నా పిలుపునిచ్చాడు కూడా! కాని, మరుసటి సంవత్సరం పరిస్థితి మారిపోయింది! 1948లో ఆగస్ట్ 14 రంజాన్ నెల 27వ రోజైంది! అది ముస్లిమ్ లకు ప్రత్యేక పర్వదినం! అందుకని అదే రోజున సంబరాలు చేసుకున్నారు. ఇక అప్పట్నుంచీ ఆగస్ట్ 14ననే పాక్ స్వతంత్ర వేడుకలు జరగటం పరిపాటి అయిపోయింది!

 

భారతదేశం స్వతంత్ర దినోత్సవం జరుపుకునే రోజున పాకిస్తాన్ జరుపుకోకపోపవటానికి మరో కారణం కూడా వుంది! అది ఇండియానే! మనమంటే అస్సలు పడని పాకీలు మనతో బాటూ స్వతంత్ర వేడుకలు జరుపుకోవటం సహజంగానే ఇష్టపడరు! ఒకవేళ జరుపుకున్నా ప్రపంచం దృష్టి భారత్ వైపునే వుంటుంది! అందుకే, ఒక రోజే ముందే హంగామా చేసేస్తూ వస్తున్నారు 69ఏళ్లుగా… ఇస్లామాబాద్ పాలకులు!