దేశ చరిత్రను మార్చేసిన ముగ్గురి సాహసం

 

B.B.D. Bagh. కోల్‌కతాలోని ఒక ప్రముఖ కూడలి. బెంగాల్ సచివాలయం లాంటి ప్రముఖ భవంతులన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రదేశానికి Dalhousie Square అని పేరు. ఆ డల్హౌసీ స్క్వేర్‌ బి.బి.డి.బాగ్‌గా మారడం వెనుక ఒక అద్భుతమైన కథ వినిపిస్తుంది.

 

ఒకనాటి బ్రటిష్‌ గవర్నర్‌ ‘లార్డ్‌ డల్హౌసీ’ పేరు మీదుగా బ్రిటిష్‌వారు కోల్‌కతాలో డల్‌హౌసీ స్క్వేర్‌ అనే ప్రాంతానికి రూపకల్పన చేశారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపారాలకీ, అధికారాలకీ ఇది కూడలిగా ఉండేది. 1930 డిసెంబర్‌ 8న ఈ డల్హౌసీ స్క్వేర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకీ హోరుతో మోతెక్కిపోయింది. ఇక్కడ బ్రిటిష్‌వారి అధికార దర్పానికి నిలువెత్తు రూపంగా ఉండే రైటర్స్ బిల్డింగ్ వణికిపోయింది. అందుకు కారణం బినయ్‌, బాదల్‌, దినేష్ అనే ముగ్గురు యువకులు.

 

బినయ్, బాదల్‌, దినేష్‌ ముగ్గురూ మూడు నేపథ్యాల నుంచి వచ్చినవారు. కానీ ఆ ముగ్గురి ఆలోచనా విధానమూ ఒక్కటే! మన దేశాన్ని ఎలాగైనా బ్రటిష్‌వారి చెర నుంచి విడిపించడమే వారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే వారు సుభాష్‌ చంద్రబోస్‌ నెలకొల్పిన ‘బెంగాల్ వాలంటీర్స్’ అనే సంఘంలో చేరారు. భారతీయులు పట్ల కర్కోటకంగా వ్యవహరిస్తున్న బ్రిటిష్‌ అధికారులను గుర్తించి, వారిని ఏరివేయడమే ఈ బెంగాల్‌ వాలంటీర్స్‌ కర్తవ్యం.

 

అప్పట్లో NS Simpson అనే బ్రటిష్‌ అధికారి ఉండేవాడు. అతను జైళ్లశాఖకి ఇన్స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తించేవాడు. తన చేతికి అందిన స్వాతంత్ర్య సమరయోధులని చిత్రహింసలు చేయడం అంటే అతనికి మహా సరదా! భారతీయులలో నిండిన జైళ్లని నరకకూపాలుగా మార్చడం అంటే అతనికి మహా ఆసక్తి. ఆ NS Simpsonని ఎలాగైనా తుదముట్టించాలని అనుకున్నారు బినయ్‌, బాదల్‌, దినేష్‌లు. అప్పటికే బినయ్‌ Lowman అనే ఓ పోలీసు అధికారిని హతమార్చి బ్రటిష్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాడు. తను చదువుతున్న వైద్యవిద్యని మధ్యలోనే ఆపివేసి పూర్తిస్థాయి విప్లవకారునిగా మారిపోయాడు. అతనికి బాదల్‌, దినేష్‌లు కూడా తోడయ్యారు.

 

1930, డిసెంబరు 8వ తేదీన ఈ ముగ్గురూ NS Simpson ఉండే రైటర్స్ బిల్డింగ్‌ను చేరుకున్నారు. అక్కడ తమని ఎవరూ అనుమానించకుండా యూరోపియన్‌ దుస్తులలో ప్రవేశించారు. నేరుగా Simpson దగ్గరకి వెళ్లి అతని గుండెల మీద తుపాకీగుళ్లని కురిపించారు. ఆ మోతకి బ్రిటిష్ సైనికులు అప్రమత్తమయ్యారు. ముగ్గురు ‘తీవ్రవాదు’లని తుదముట్టించేందుకు ఎదురు కాల్పులు మొదలుపెట్టారు.

 

బ్రిటిష్‌వారు తమ మీద ఎదురుదాడి చేస్తారని బినయ్, బాదల్‌, దినేష్‌లకు ముందుగానే తెలుసు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ప్రాణాలతో లొంగకూడదని నిశ్చయించుకున్నారు. అందుకే బాదల్ పొటాషియం సైనేడు మాత్ర మింగేశాడు. బినయ్‌, దినేష్‌లు తమని తాము కాల్చేసుకున్నారు. ఆ గాయంతోనే బినయ్‌ ఆసుపత్రిలో చనిపోయాడు. దినేష్‌ కోలుకుని, మరుసటి ఏడు ఉరికంబాన్ని ఎక్కాడు.

 

బినయ్‌, బాదల్‌, దినేష్‌ల దాడితో బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయుల పట్ల భయం మొదలైంది. దేశంలోని విప్లవకారులకి ఈ చర్య సరికొత్త ఉత్తేజాన్ని అందించింది.

- నిర్జర.