టీకాంగ్రెస్ లో జగ్గారెడ్డి కలకలం... గాంధీభవన్ లో గుసగుసలు....

 

తూర్పు జయప్రకాష్ రెడ్డి... అలియాస్ జగ్గారెడ్డి... సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే... కేసీఆర్ ప్రభంజనంలో సైతం విజయఢంకా మోగించిన మాస్ లీడర్. ఇక, జగ్గారెడ్డి ఏం మాట్లాడినా... ఏం చేసినా సంచలనమే... పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారినా... రాజకీయాలకు అతీతంగా ప్రజా మద్దతును సంపాదించుకున్నారు. అందుకే, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి... జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నంతగా క్రేజు సంపాదించుకున్నారు. సంగారెడ్డిని కంచుకోటగా మలుచుకున్న జగ్గారెడ్డి... పంచ్ డైలాగులు పేల్చడంలోనూ... నమ్మి తన దగ్గరకి వచ్చేవారికి సాయం చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. అందుకే, పార్టీలకతీతంగా జగ్గారెడ్డికి మంచి పేరుంది. ఇక, ఏదైనాసరే నిర్మోహమాటంగా, భయం లేకుండా చెప్పగలిగే ధైర్యమున్న జగ్గారెడ్డి.... ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నించడం టీకాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసిన జగ్గారెడ్డి... పీసీసీ చీఫ్ ను మార్చాల్సి వస్తే మాత్రం తనకే అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ ముందు ప్రతిపాదన పెట్టారు. తన బయోడేటాను కాంగ్రెస్ హైకమాండ్ కు అందజేసిన జగ్గారెడ్డి... తన రాజకీయ జీవితం, ఏయే పార్టీల్లో ఏయే హోదాల్లో పనిచేసింది... అలాగే తనపై ఉన్న కేసులు, తన వ్యక్తిత్వం గురించి తెలియజేస్తూ ఏఐసీసీకి బయోడేటా సమర్పించారు. అంతేకాదు, తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే... తాను ఎన్నికల్లో పోటీ చేయనని, అలాగే, రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానంటూ తెలిపారు. అంతేకాదు, తనకు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదని, కాంగ్రెస్ ను గెలిపించడమే తనకు ముఖ్యమని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.

అయితే, సడన్ గా జగ్గారెడ్డి రేసులోకి రావడం... కాంగ్రెస్ హైకమాండ్ కే నేరుగా బయోడేటా ఇవ్వడం... గాంధీభవన్లో టాప్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ సైలెంట్ గా ఉండి... ఇప్పుడు సడన్ గా ఎందుకిలా హడావిడి చేస్తున్నాడని సీనియర్లు చర్చించుకుంటున్నారు. అయితే, జగ్గారెడ్డే సొంతగా ప్రయత్నాలు చేస్తున్నారా? లేక జగ్గారెడ్డి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. గాంధీభవన్ లో గుసగుసలు ఎలాగున్నా, పీసీసీ పగ్గాలు కోసం జగ్గారెడ్డి ప్రయత్నాలు చేయడం మాత్రం టీకాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.