భర్త తీరు వల్లే మంత్రి పదవి పోగొట్టుకున్న గొంగిడి సునీత.. అయినా మారని తీరు!

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత గెలిచారు. ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి మాత్రం పెత్తనమంతా తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మహేంద్రరెడ్డి షాడో ఎమ్మెల్యేగా మారటంతో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. పాలనా వ్యవహారాల్లో తలదూర్చడం ఆయనకు బాగా అలవాటు. రియల్ సెటిల్ మెంట్లు చేస్తారని ఇక్కడి ప్రజలలో బలంగా టాక్ వినిపిస్తోంది. 

నిజానికి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ కావడం, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం గుర్తించిన కేసీఆర్ 2014 లో ఆలేరు ఎమ్మెల్యే టికెట్ సునీతకి ఇచ్చారు. కేసీఆర్ ప్రభంజనంలో సునాయాసంగా గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు సునీత. ఇక అక్కడి నుంచి ఆమె భర్త మహేందర్ రెడ్డి దూకుడు పెంచారు. అధికారుల పై పెత్తనం చెలాయిస్తున్నారు. వారిని తన కనుసన్నల్లోనే ఉండేటట్లు చేస్తున్నారు గొంగిడి మహేందర్ రెడ్డి. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి టెంపుల్ విస్తరణ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపించింది. ఫలితంగా యాదాద్రి చుట్టు పక్కల ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. లక్షల రూపాయల వున్న భూములు కాస్తా ఇప్పుడు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయి. దీంతో ఇక్కడ రియల్ వ్యాపారాలూ చెయ్యాలంటే ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్ రెడ్డిని కలవాల్సిందే, ఆయన అనుమతి, వ్యాపారంలో వాటా లేకుండా ఇక్కడ రియల్ వ్యాపారం జరిగే పరిస్థితి లేదు. సెటిల్ మెంట్ లు కూడా బాగానే చేస్తారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి సెటిల్ మెంట్ల గురించి బాధితులు ఆయన పై అనేకసార్లు ఆలేరు నియోజకవర్గం లోనే లోకల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఆ ఫిర్యాదుల గురించి పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఇక 2018 లో ఆలేరు నుంచి మరోసారి గొంగిడి సునీత ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. ఇటీవల ఓ ఐసీడీఎస్ అధికారిణి బాల్య వివాహం అడ్డుకున్నందుకు షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఆమెను బెదిరించాడు. తన విధులకు ఆటంకం కలిగించాడని ఏకంగా ఎమ్మెల్యే భర్తపైనే ఐసిడిఎస్ ఆఫీసర్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. అంటే ఆయన పెత్తనం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అధికారులను పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకుని ఎమ్మెల్యే భర్త చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ప్రజలలో బాగానే వినిపిస్తున్నాయి. అయితే గొంగిడి మహేందర్ రెడ్డి ప్రవర్తించే తీరు చూసి ఎమ్మెల్యే సునీతనా, మహేందర్ రెడ్డి నా అని కొందరు అనుకుంటున్నారు. ఎమ్మెల్యే షాడో అని మరికొందరంటున్నారు. మహేందర్ రెడ్డి ప్రవర్తనతో ఎమ్మెల్యే సునీతకు చెడ్డ పేరు వస్తుందని నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.2018 ఎన్నికల ప్రచారంలో సునీతను గెలిపిస్తే ఈ సారి పెద్ద పదవి ఇస్తానని గులాబీ బాస్ కేసీఆర్ ఇక్కడి ప్రజలకూ చెప్పారు. అయినా ఎమ్మెల్యే భర్త దూకుడు చూసి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వ విప్ తో సరిపెట్టారని ఆలేరు నియోజక వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.