అమిత్ షాను కలిసిన శ్రీలక్ష్మి.. వైసీపీ డైరెక్షనా?

 

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకురావాలని వైసీపీ ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు సమయంలో.. శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లొచ్చారు. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యంపాలైన ఆమె, బెయిల్ పొంది.. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో.. ఆమెను తెలంగాణ క్యాడర్ కు కేటాయించారు. అయితే ఏపీలో వైసీపీ గెలిచిన తర్వాత జగన్.. కొంత మంది తెలంగాణ అధికారులను ప్రత్యేకంగా ఏపీకి తీసుకురావాలనుకున్నారు. వారిలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. కేసీఆర్ తో జరిగిన తొలి భేటీలోనే.. వీరిని ఏపీకి డిప్యూటేషన్ పై పంపాలని జగన్ కోరారు. దానికి కేసీఆర్ అంగీకరించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో.. ఫైల్ ను కేంద్రానికి పంపారు. 

సివిల్ సర్వీస్ అధికారుల డిప్యూటేషన్లు చూసే.. ఢిల్లీలోని డీవోపీటీ విభాగం వీరి డిప్యూటేషన్ ఫైళ్లను పక్కన పెట్టేసింది. నిబంధనల ప్రకారం.. బలమైన కారణం లేకపోవడంతో డిప్యూటేషన్ పని జరగడం లేదు. విజయసాయిరెడ్డి.. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించినా పని కాకపోవడంతో.. నేరుగా శ్రీలక్ష్మినే ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. విజయసాయి.. శ్రీలక్ష్మిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తీసుకెళ్లారట. పార్లమెంట్ ప్రాంగణంలో అమిత్ షాను కలిసిన శ్రీలక్ష్మి.. తనను ఏపీకి డిప్యుటేషన్ పై పంపాలంటూ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే.. డిప్యూటేషన్ పై అమిత్ షా హామీ ఇచ్చారో లేదో స్పష్టత లేదు. మరో వైపు శ్రీలక్ష్మీకి ఓకే చెబితే.. స్టీఫెన్ రవీంంద్ర ఫైల్ కూడా ఓకే అవుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపధ్యంలో డిప్యూటేషన్ల పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.