జైలుకెళ్లి వచ్చిన అధికారిణి శ్రీలక్ష్మి కోసం విశ్వప్రయత్నాలు!

 

తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో మరోసారి ప్రత్యక్షమయ్యారు. డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చేందుకు నాలుగు నెలల నుంచి ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాన మంత్రి పరిధిలో ఉండే కేంద్ర సిబ్బంది, శిక్షణ ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారులను కలిసేందుకు గురువారం( నవంబర్ 28న ) పార్లమెంట్ కు వచ్చిన ఆమె వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెంట కనిపించారు. కేసుల నేపథ్యంలో ఆమెను డిప్యుటేషన్ పై పంపడానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నట్లు సమాచారం. సీబీఐ కేసుల్లో ఉన్నప్పుడు అంతర్రాష్ట్ర బదిలీకి ఎలా అవకాశమిస్తామని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. 

లక్ష్మి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి కాదు..రాష్ట్ర విభజన నేపథ్యం లో ఆమె తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నారు. ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీకి డిప్యుటేషన్ పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తుని తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించినా కేంద్రం వ్యతిరేకించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఆమె నిందితురాలు కావడమే దీనికి కారణమని తెలుస్తొంది. ఆమె ఢిల్లీలో మకాం వేసి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఆయనతో పాటు వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర మంత్రులను కలుస్తున్నారు. ఆయన లేనప్పుడు విజయసాయిరెడ్డి వెంట వెళ్లి వారితో సమావేశమవుతున్నారు. 

డిప్యుటేషన్ కు అనుమతి రాకున్నా శ్రీలక్ష్మి ఆంధ్రా భవన్ లోనే మకాం పెట్టడం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ కేడర్ ఐఏఎస్ కు ఇక్కడ క్యాటగిరీ 1 గది కేటాయించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. దీనికి తోడు ఆమెకు కారు కూడా ఏపీ భవన్ సమకూరుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రాకు చెందిన ముఖ్య కార్యదర్శి కి ఇచ్చే సదుపాయాలన్నీ తెలంగాణ అధికారిణి కేటాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో అధికారులు ఆమెకు ఆంధ్రా భవన్ లోనే వసతి కల్పిస్తున్నారు. ఒకవేళ డిప్యుటేషన్ ఖాయమైతే ఆమె నేరుగా జగన్ పేషీలో నియమితులు కావచ్చని ఆ భయంతోనే ఈ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఏపీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.